రాష్ట్రవ్యాప్తంగా గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో తెలంగాణలోని పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియోను రూ.4 లక్షల నుంచి రూ .5 లక్షలకు పెంచుతున్నట్లు చెప్పారు. భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వరదల్లో చనిపోయిన పశువులు, మేకలు, గొర్రెలకు కూడా పరిహారం పెంచాలని అన్నారు. అంతేకాదు, బాధితులకు వేగంగా పరిహారం అందించాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక బృందాలు చేపడుతున్న చర్యలపై కూడా ముఖ్యమంత్రి అధికారులను ఆరా తీశారు. మరో రెండు, మూడు రోజులు భారీ వర్ష సూచన ఉన్నందున్న అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ సెలవులు పెట్టవద్దని ఆదేశించారు.