తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద నీరు ఇళ్లలోకి ప్రవేశించడం వల్ల జన జీవనం స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ మరో అలెర్ట్‌ను జారీ చేసింది. పలు జిల్లాల్లో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. అత్యవసరమైతే తప్పా ఆయా జిల్లాల ప్రజలు బయటకు రావొద్దని సూచించింది.