Hezbollah Rocket Attack On Israel: ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా రివెంజ్ అటాక్ చేసింది. లెబనాన్‌లో పేజర్లు, వాకీటాకీల పేలుళ్ల నేపథ్యంలో హెజ్‌బొల్లా ఏకంగా 140 రాకెట్లు ప్రయోగించింది. ఈ దాడులు నార్త్ ఇజ్రాయెల్‌లోని పలు మిలటరీ బ్యారెక్స్‌పై జరిపినట్లు హెజ్‌బొల్లా ప్రకటించింది. ఈ రాకెట్లుమూడు దఫాలుగా లెబనాన్ సరిహద్దుల నుంచి దూసుకొచ్చినట్లు ఇజ్రాయెల్ మిలటరీ ధ్రువీకరించింది. ఈ దాడిలో ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ హద్దుమీరిందని, ప్రతి దాడి ఉంటుందంటూ హెజ్‌బొల్లా అధినేత హసన్ నస్రల్లా హెచ్చరించిన నేపథ్యంలో ఈ రాకెట్లను ప్రయోగించింది. అయితే ఇటీవల పాలస్తీనాలోని హమాస్‌పై దృష్టి పెట్టిన ఇజ్రాయెల్ దళాలు.. ఇప్పుడు హెజ్‌బొల్లాను లక్ష్యంగా చేసుకుంది. ఈ క్రమంలోనే పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో లెబనాన్ అట్టుడికింది. ఈ పేలుళ్ల వెనుక ఇజ్రాయెల్ కుట్ర ఉందనేది హెజ్‌బొల్లా భావిస్తోంది. ఈ క్రమంలోనే దక్షిణ లెబనాన్‌పై గురువారం ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడగా.. తాజాగా, హెజ్‌బొల్లా ప్రతీకార దాడికి దిగడం గమనార్హం.