ప్రతిపక్షం ప్రతినిధి, నకిరేకల్: నకిరేకల్ నియోజకవర్గ పరిధిలో సోమవారం ప్రజలు ఆనందోత్సాహాలతో హోలీ పండుగను జరుపుకున్నారు. నకిరేకల్ పట్టణంలో ఎమ్మెల్యే వేముల వీరేశం, ఆయన సతీమణి పుష్పక్క, టిపిసిసి కార్యదర్శి చామల కిరణ్ కుమార్ రెడ్డి హోలీ వేడుకలో పాల్గొని కాంగ్రెస్ కార్యకర్తలకు అభిమానుల కు ఉత్సాహాన్ని ఇచ్చారు. ఎమ్మెల్యేను అభిమానులు ఆకాశానికి ఎత్తుకోగా డాన్స్ చేశారు. వాహనంలో డీజే సౌండ్ సిస్టం ఏర్పాటు చేశారు. డ్యాన్సులు చేస్తూ పట్టణంలో ర్యాలీగా వేముల అభిమానులు ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. కూడలిలో ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా తాను పనిచేస్తానని స్పష్టం చేశారు.
అలాగే చిట్యాల పట్టణంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో మొదటిసారిగా హోలీ వేడుకలను ఆనందోత్సాహాలతో నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, కౌన్సిలర్లు, పూర్వ విద్యార్థులు హోలీ వేడుకల్లో పాలుపంచుకున్నారు. గ్రామాల్లో సైతం యువకులు, గ్రామస్తులు ఉత్సాహంగా హోలీ ఆడారు.