ప్రతి ఊరిలో గ్రంథాలయం ఏర్పాటు చేయడమే లక్ష్యం
గ్రంథాలయ ఉద్యమ కారులు అనుముల శ్రీనివాస్..
ప్రతిపక్షం, ప్రతినిధి, నకిరేకల్: చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన గ్రంధాలయ ఉద్యమకారులు అనుముల శ్రీనివాస్ ఇటీవలే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం నుండి కీర్తి పురస్కారం అందుకున్న సందర్భంగా గ్రామంలోని గ్రంథాలయం పాఠకులు మంగళవారం ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా అనుముల శ్రీనివాస్ మాట్లాడుతూ.. సొంత గ్రామమైన గుండ్రాంపల్లి లో 2006 వ సంవత్సరం లో మొదలైన ఈ గ్రంధాలయోద్యమం ఈ రోజు ఉభయ తెలుగు రాష్ట్రాలలకు వ్యాప్తి చెందిందని అన్నారు. ఇందుకు తన చిన్ననాటి మిత్రులు, గుండ్రాంపల్లి ప్రజలు, మేధావుల తోడ్పాటు ఉందన్నారు. తెలుగు రాష్ట్రాలలో ప్రతి గ్రామంలో గ్రంధాలయం ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని అన్నారు.
గ్రామం లో అన్ని వసతులతో కూడిన గ్రంధాలయం ఏర్పాటు చేయడం యువతకు చాలా ఉపయోగకరంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమం లో గ్రంధాలయ కమిటీ సభ్యులు వెల్లంకి లక్ష్మణా చారి, గోపగోని శ్రీనివాస్, గోలి అంజయ్య, అంతటి శివలింగం, గరిశే నర్సింహా, మండలోజు శ్రీనివాస చారి, దోర్నాల శివ, నక్కెర్తి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.