మావోయిస్టు చీఫ్ ‘నంబాల’ మృతి
మరో 27 మంది మావోయిస్టులు కూడా
ప్రతిపక్షం, భద్రాచలం
ఛత్తీస్‌గఢ్ అడవులు మరోసారి కాల్పులమోతతో దద్దరిల్లాయి. నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడలలో మావోయిస్టులకు, భద్రతా దళాలకు జరిగిన ఎదురుకాల్పులలో బుధవారం 28 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మృతులలో మావోయిస్టు పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు (66) ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై రెండు దశబ్దాల కిందట అలిపిరిలో జరిగిన బాంబుదాడిలో ఈయన ప్రధాన సూత్రధారి. ఆయన మీద రూ.1.5 కోట్ల భారీ రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతాన్ని ఎన్నోసార్లు జల్లెడ పట్టినా పలుమార్లు చాకచక్యంగా తప్పించుకున్న ‘నంబాల’ ఈసారి ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు. ఐఈడీల వినియోగంలోనూ నంబాల ఎక్స్‌పర్ట్. ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో అలిపిరి దాడుల సూత్రధారి చలపతి చనిపోవడం తెలిసిందే. కోబ్రా కమాండోలు, ఛత్తీస్‌గఢ్ పోలీసులు, మావోయిస్టుల కంపెనీ-– 7 యూనిట్‌ను టార్గెట్ చేశాయి. బసవరాజ్, మధు (దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అగ్ర మావోయిస్టు నేత), మావోయిస్టు ప్రచురణ ‘జంగ్’తో సంబంధం ఉన్న నవీన్ కూడా చనిపోయాడని తెలుస్తోంది. ‘పక్కా సమాచారం మేరకు భద్రతా దళాలు మావోయిస్టు కీలక నేతలు ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. వారిని లొంగిపొమ్మని హెచ్చనించాయి. కానీ, మావోయిస్టులు తప్పించుకునేందుకు యత్నించి ఎదురుకాల్పులు జరిపారు.అనంతరం ఆ ప్రాంతం నుంచి 28 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాం. మృతులలో మావోయిస్టు కీలక నేత నంబాల కేశవరావు కూడా ఉన్నారు’ అని ఆ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.