ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయాన్ని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి వారు, ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామివారు సందర్శించారు. దేవాలయ వ్యవస్థపక సభ్యురాలు, నిర్వాహకురాలు శశికళ పీఠాధిపతులకు స్వాగతం పలికారు. పీఠాధిపతులు అమ్మవారికి స్వయంగా కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారు మాట్లాడుతూ.. కులాలకు అతీతంగా హిందూ సమాజం అంతా కలిసి ఈ దేవాలయాన్ని రక్షించుకోవడం చాలా గొప్ప విషయమన్నారు. అనేక పోరాటాలు, త్యాగాలు వలన ఈ రోజు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం మన కళ్ల ముందు కనబడుతోందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఇంతగా అభివృద్ధి చెందడానికి కారణం భాగ్యలక్ష్మీ అమ్మవారి అనుగ్రహమేనని అన్నారు. కుల, మతాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే భాగ్యలక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కావలసిందేనని తెలిపారు. మహాలక్షీ అమ్మవారి అనుగ్రహంతో దేశ ఆర్ధిక రాజధానిగా ముంబై నగరం వెలుగొందుతున్నట్లుగానే, భాగ్యలక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో హైదరాబాద్ నగరం వెలుగొందగలదని స్వామివారు తెలిపారు. దేవాలయ అభివృద్ధికి ఎటువంటి అవసరం ఉన్నా విశాఖ శ్రీ శారద పీఠం అందిస్తుందని స్వామివారు తెలిపారు.
అతి త్వరలోనే హైదరాబాద్ నగరం పేరు భాగ్యనగరంగా స్థిరపడాలని స్వామివారు ఆకాంక్షించారు. హిందూ సమాజం అంతా ఏకతాటిపైకి వచ్చి సనాతన ధర్మాన్ని, దేవాలయ వ్యవస్థను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అందుకు తగిన పూర్తి సహాయ సహకారాలు అందించడానికి విశాఖ శ్రీ శారదా పీఠం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని తెలియజేశారు. ఆలయ పాలక మండలి సభ్యులందరూ స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. స్వామివారు చార్మినార్ ప్రాంతానికి రావడంతో చుట్టు పక్కల అంతా ప్రశాంత వాతావరణం ఉండేలా పోలీస్ సిబ్బంది తగిన చర్యలు తీసుకున్నారు. అనంతరం బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ ఆలయాన్ని, కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.