Special actions of officers Hyderabad Heavy Rain:హైదరాబాద్ నగరంలో పలుచోట్ల కుండపోత వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబీహిల్స్, ఫిల్మ్ నగర్, కూకట్ పల్లి, నిజాంపేట్, జేఎన్టీయూ, మూసాపేట్, ఎస్ఆర్ నగర్, కోఠి,వనస్థలిపురం, ఎల్బీనగర్, దిల్‌సుఖ్ నగర్, నాంపల్లి, హబ్బిగూడ, నాచారం, మల్లాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయం కావడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. అవసరమైతే తప్పా బయటకు రావొద్దని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా, హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల సమయంలో వేగంగా స్పందించేందుకు అధికారుల ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అన్ని శాఖల అధికారులతో హైదరాబాద్ సీపీ ఆనంద్ సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల సమయంలో వేగంగా స్పందించి కీలకమైన కూడళ్లలో వరదనీరు, ట్రాఫిక్ క్రమబద్దీకరణ, తదితర అంశాలపై చర్చించారు. వాతావరణ శాఖ హెచ్చరికలను అనుసరించి ట్రాఫిక్ మళ్లింపులు చేయడం, నీరు నిలిచే ప్రాంతాల్లో వెంటనే చర్యలు చేపట్టడం వంటి అంశాలపై అధికారులు చర్చించారు. ఈ సమీక్షలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, మూడు కమిషనరేట్ల సీపీలు, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్, హెచ్‌ఎండీఏ, హైడ్రా అధికారులు పాల్గొన్నారు.