హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ఏజెన్సీ (హైడ్రా) అక్రమ కూల్చివేతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ గగన్ పహాడ్‌లో అప్పచెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. ఆక్రమణదారులు ఇక్కడ చెరువు భూములను కబ్జా చేసి షెడ్లు వేశారు. దీంతో హైడ్రా అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య నిర్మాణాలను కూల్చివేస్తున్నారు.
అప్ప చెరువు మొత్తం విస్తీర్ణం 35 ఎకరాలు. 3.5 ఎకరాలు ఆక్రమించుకుని గోడౌన్లు నిర్మించుకున్నారని హైడ్రా అధికారులు సమాచారం. ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమ కట్టడాలను తొలగించాలని బిల్డర్లను ముందుగానే హెచ్చరించినా.. వారి నుంచి కదలిక రాకపోవడంతో హైడ్రా రంగంలోకి దిగింది. అయితే కూలుస్తున్న గోడౌన్లు స్థానిక మైలార్దేవ్‌పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డివే అని తెలుస్తోంది. కాసేపటి క్రితం ఆయన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కానీ ఏమీ స్పందించకపోవడం గమనార్హం.