Demolishing at Malkapur Cheruvu: రాష్ట్రంలో హైడ్రా దూకుడు కొనసాగుతోంది. తాజాగా, సంగారెడ్డి జిల్లాలో ఓ భవనాన్ని కూల్చివేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లాలోని కొండపూర్ మండలం మల్కాపూర్ చెరువు మధ్యలో అక్రమంగా నిర్మించిన ఓ భారీ భవనాన్ని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కూల్చివేశారు.
మల్కాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మధిర గ్రామంలో సికింద్రాబాద్‌కు చెందిన వ్యక్తి 12 ఏళ్ల కిందట మల్కాపురం పెద్దచెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఓ భవనాన్ని నిర్మించారు. అయితే చెరువులో నీళ్లు ఉండడంతో నీళ్లలో అడుగుపెట్టకుండా లోపలికి వెళ్లడానికి కొంత దూరం నుంచే మెట్లు కట్టారు. ఆ యజమాని కుటుంబసభ్యులు వీకెండ్‌లో ఇక్కడి వచ్చి సేద తీరుతుంటారని గ్రామస్తులు తెలిపారు.
అయితే, ఈ విషయాన్ని కొంతమంది రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు, బాంబుల ద్వారా అక్రమ కట్టడాలను కూల్చివేశారు. చెరువులో అక్రమ నిర్మాణం ఉండటంతో బాంబుల ద్వారా నేలమట్టం చేశారు. చెరువు నీటి మధ్యలో నిర్మించిన భవనాన్ని బ్లాస్టింగ్ చేసే క్రమంలో భవనం నుంచి ఒక రాయి నేరుగా వచ్చి సమీపంలో అక్కడ నిల్చున్న హోంగార్డు గోపాల్‌కు తగిలింది. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.