ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 13: దేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నది. దేశం ప్రజాస్వామ్య దేశంగా మారి 74 సంవత్సరాలవుతుంది కానీ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే శాసనసభ, లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తమ ప్రజాస్వామ్య బద్ధమైన ఆయుధమైన ఓటు హక్కును వినియోగించుకున్నందుకు చాలామంది వెనుక ముందు ఆలోచిస్తూనే ఉన్నారు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్లు సంబంధిత శాఖలు ప్రతి ఎన్నికల సమయంలో తమదైన రీతిలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని.. ప్రచారాస్త్రాల ద్వారా అవగాహన సదస్సుల ద్వారా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అయినా ప్రజలను ఆ స్థాయి మార్పు కనిపించకపోవడం బాధిస్తుంది. ప్రతి ఎన్నికలలో పోలింగ్ శాతాన్ని గమనించినట్లయితే గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాలలో అత్యంత స్వల్పంగా కనిపిస్తుంది. అయితే ఈ దానిని దృష్టిలో పెట్టుకున్న నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన పలువురు చిన్నారులు ఆదివారం తమదైన రీతిలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని వినూత్నంగా ఓటర్లను చైతన్య పరిచే కార్యక్రమాన్ని నిర్వహించారు.
వందశాతం పోలింగ్ నమోదు చేయడమే లక్ష్యంగా మండుటెండలలో సహితం పట్టణంలోని ప్రధాన అంతర్గత వీధులలో, సముదాయాలలో తిరుగుతూ ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటుకు ఉన్న విలువను ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఓటరుకు కలిగే లాభాలు ప్రయోజనాలను వివరించారు.
పట్టణంలోని బాలాజీ వాడకు చెందిన ఆరవ తరగతి విద్యార్థిని పుసాల హన్సిని ఐదవ తరగతి విద్యార్థిని శ్రీనిధి లు అదే మాదిరి శాన్విక, సెయింట్ థామస్, భాష్యం వాసవి పాఠశాలలో యూకేజీ చదువుతున్న శాన్విక శాంతినికేతన్ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న త్రీ లోచన్ లు గ్రూపులుగా ఏర్పడి ఓటు వజ్రాయుధమని ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటును సద్వినియోగం చేసుకోవాలని అవగాహన కల్పించడంతోపాటు ప్ల కార్డులను ప్రదర్శించారు. వంద శాతం పోలింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా చేయడంతో పాటు రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లాకు ప్రథమ స్థానం వచ్చేలా ఈ ప్రణాళిక రూపొందించుకున్నట్లు వారు ఈ సందర్భంగా తెలిపారు.