ప్రతిపక్షం, వెబ్ డెస్క్: దేశంలో క్రికెట్ పండగకు వేళైంది. IPL-2024 ఐపీఎల్ 17వ సీజన్‌ను శుక్రవారం అట్టహాసంగా ప్రారంభించనున్నారు. టైటిల్ కోసం 10 జట్లు బరిలోకి దిగుతున్నాయి. అయితే ఈ ఐపీఎల్ సీజన్లో కొన్ని కొత్త రూల్స్ కూడా అమల్లోకి రానున్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
బౌలర్లకు ఫేవరేట్..
ఈ సారి ఒకే ఓవర్లో రెండు బౌన్సర్లను అనుమతించనున్నారు. గత సీజన్ వరకు ఒక్క షార్ట్ బాల్ వేయడానికి మాత్రమే బౌలర్లకు అనుమతి ఉండేది. కానీ ఈ సారి గరిష్ఠంగా వాటిని రెండింటికి పెంచారు. ఈ నిబంధనను బీసీసీఐ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనే ప్రవేశపెట్టింది. ఈ రూల్ వల్ల బ్యాటు, బంతి మధ్య పోటీ ఆసక్తికరంగా సాగుతుంది.
నో స్టాప్ క్లాక్..
అలాగే స్టంపింగ్ అపీల్లో ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ సలహాను కోరినప్పుడు ముందుగా క్యాచ్‌ను చెక్ చేసే రూల్ కొనసాగించనున్నారు. అయితే ఇది ఐసీసీ రూల్స్‌కు భిన్నంగా ఉంది. మరోవైపు ఐసీసీ తీసుకువచ్చిన స్టాప్ క్లాక్ రూల్‌ను ఈ ఐపీఎల్ సీజన్లో అమలు చేయొద్దని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. స్టాప్ క్లాక్ నిబంధన ప్రకారం ఫీల్టింగ్ జట్టు 60 సెకన్ల లోపు తదుపరి ఓవర్ వేయాలి. అలా జరగని పక్షంలో ఫీల్డింగ్ జట్టుకు అంపైర్లు రెండు సార్లు హెచ్చరిస్తాడు. ఆ తర్వాత అయిదు పరుగుల పెనాల్టీ విధిస్తాడు.
స్మార్ట్ రిప్లే సిస్టమ్..
వేగంగా కచ్చితమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఈ సీజన్లో స్మార్ట్ రిప్లే సిస్టమ్ టెక్నాలజీ తీసుకురానున్నారు. దీని వల్ల టీవీ అంపైర్ నేరుగా హాక్ ఐ ఆపరేటర్స్ ద్వారా ఇన్పుట్స్ తీసుకుంటాడు. మైదానం చుట్టూ పెట్టే ఎనిమిది హైస్పీడ్ హాక్ ఐ కెమెరాల నుంచి బ్రాడ్ కాస్టర్ డైరెక్టర్‌తో సంబంధం లేకుండా రీప్లేలను టీవీ అంపైర్ పరిశీలించవచ్చు. దీంతో వేగంగా నిర్ణయాన్నివెల్లడించే అవకాశం ఉంటుంది. అంతకుముందు టీవీ అంపైర్‌కు కావాల్సిన యాంగిల్స్‌ను బ్రాడ్కాస్ట్ డైరెక్టర్‌ను కోరితేనే హాక్ఐ ఆపరేటర్స్ సాయం చేసేవారు.