Amit Shah unveils BJP manifesto: జమ్మూకశ్మీర్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టో ప్రకటించింది. ఈ మేరకు హోం శాఖ మంత్రి అమిత్ షా.. బీజేపీ మేనిఫెస్టో ‘సంకల్ప్ పత్ర’ను విడుదల చేశారు. ఇందులో 25 తీర్మానాలను ప్రకటించారు. వృద్ధ మహిళలకు ఏడాదికి రూ.18వేలు, పీఎంయూజే లబ్ధిదారులకు ఏడాదికి 2 ఉచిత గ్యాస్ సిలిండర్లు, 5 లక్షల ఉద్యోగాల కల్పన, కాలేజీ విద్యార్థులకు ఏడాదికి రూ.3వేల ప్రయాణ భత్యం, గ్రామీణ ప్రాంత హెచ్ఎస్సీ విద్యార్థులకు ట్యాబ్స్, ల్యాప్ టాప్స్, పోటీ పరీక్షల అభ్యర్థుల కోచింగ్ కోసం రెండేళ్లపాటు రూ.10వేల రీయింబర్స్ మెంట్ వంటి హామీలు ఇచ్చింది.
కాగా, 2019 లో ఆర్టికల్ 370 రద్దు కావడంతో రాష్ట్ర హోదా కోల్పోయి కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. అంతకుముందు 2014లో ఐదు దశల్లో ఎన్నికలు జరగగా.. ఈ సారి మూడు విడతల్లో జరగనున్నాయి. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గానూ తొలి దశలో 24 అసెంబ్లీ స్థానాలకు, రెండు, మూడు దశల్లో 26, 40 స్థానాలకు పోలింగ్ జరగనుంది. సెప్టెంబర్ 18న తొలివిడత జరగనుండగా.. సెప్టెంబర్ 25న రెండో విడత, అక్టోబర్ 1న మూడో విడత పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక, అక్టోబర్ 8న ఫలితాలు విడుదల చేయనున్నారు.