ప్రతిపక్షం, హనుమకొండ ప్రతినిధి, మే 03: వరంగల్ నగరాన్ని అన్నిరంగాలలో అభివృద్ధి పథంలో నిలపడమే కాంగ్రెస్ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య తెలిపారు. వరంగల్ ఓసీటీ గ్రౌండ్‌లో వాకర్స్‌తో కలిసి కావ్య మార్నింగ్ వాక్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వాకర్స్‌తో మాట్లాడారు. అదే క్రమంలో కూరగాయలు అమ్మే వ్యాపారుల వద్దకు వెళ్లి కూరగాయలు అమ్మారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వరంగల్ నగర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తుందన్నారు.
వరంగల్ నగర అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించరాని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. వరంగల్ నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నిలపడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. దేశంలో బీజేపీ ఆవలంబిస్తున్న మతత్వ విధానాలను ప్రజలకు వివరించారు. దేశంలో ప్రజలు స్వేచ్ఛగా జీవించాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.