Trending Now

రైతు రాజ్యమంటే.. రైతుల నోట్లో మట్టికొట్టడమేనా..?

కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్

ప్రతిపక్షం, కరీంనగర్, ఏప్రిల్ 23: రైతు రాజ్యమంటే.. రైతుల నోట్లో మట్టికొట్టడమేనా..? కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. మార్పు తెస్తాం.. అందరిని ఉద్దరిస్తాం.. రైతు రాజ్యం తెస్తాం.. రైతుల బాధలు తీరుస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు వట్టి నీటిమూటలుగా మారిపోతున్నాయని ఆయన అన్నారు. మానకొండూర్ మండలం ముంజంపల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రభుత్వ మద్దతు ధరకు ధాన్యం కొనడంతో పాటు క్వింటాలుకు ₹500ల బోనస్ ఇస్తామని నమ్మబలికి, ఇప్పుడు తీరా అధికారంలోకి వచ్చాక వచ్చే పంట నుంచి బోనస్ అనడమేంటని సీఎం రేవంత్ రెడ్డి మాటలు చూస్తుంటే గాలిమాటలే అన్నట్టుగా ఉందన్నారు.

బోనస్ పైసలు దేవుడెరుగు కానీ ఉన్న ధాన్యమే కొంటలేరని.. కొనుగోలు కేంద్రాల్లో గొనె సంచులు అందుబాటులో లేవని.. ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదన్నారు. డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని ఇప్పుడు ఆగస్టు 15లోగా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద ఒట్లు వేస్తున్నారని అన్నారు. కౌలు రైతులకు ₹12వేల సాయం చేస్తామని నోరుమెదపడం లేదన్నారు. యాసంగి పంటలకు సాగునీళ్లు ఇవ్వకపోవడంతో పంటలు ఎండి కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ళకు వేగవంతంగా పూర్తి చేయాలని.. ఇప్పటికే అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసి పోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవి. రామకృష్ణ రావు, జడ్పీటీసి శేఖర్ గౌడ్, తదితరులు ఉన్నారు.

Spread the love

Related News

Latest News