ప్రతిపక్షం, కరీంనగర్ ఏప్రిల్ 10: అధికారంలోకి రామనే ఉద్దేశ్యంతో పీసీసీ అధ్యక్షుడి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి అడ్డగోలు అబద్దాలు చెప్పి.. తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చాక రైతుల నోట్లో మట్టికొడుతున్నారని రైతుల ఉసురు పోసుకుంటే ప్రభుత్వానికి పుట్టగతులుండవని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండలం గోపాల్ పూర్ గ్రామంలో ఎండిన పంటలను ఆయన మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్, జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ తో కలిసి పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఇది కాలం తెచ్చిన కరువు కాదని.. కాంగ్రెస్ ప్రభుత్వ రైతులపై కక్షగట్టి తెచ్చిన కరువని అన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని.. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రైతుల బ్రతుకులు ఆగమైపోతున్నాయని అన్నారు. సాగు నీళ్లు లేక ఎండిన పంటలకు ప్రభుత్వం వెంటనే ఎకరాకు ₹2,5000ల పంట నష్ట పరిహారంతో పాటు.. యాసంగి వరి పంటకు క్వింటాలు కు ₹5,00ల భోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ మద్దతు ధర కంటే ఏ ఒక్క రైతు పంట అమ్ముకోరని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పడానికే కమిటీల పేరుతో కాలయాపన చేసేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.
అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే డిసెంబర్ 9 నాడు ₹2లక్షల రుణమాఫీ చేస్తాం.. రైతులు బ్యాంకులకు వెళ్లి రుణాలు తెచ్చుకోవాలని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు రైతు రుణమాఫీపై ఎందుకు స్పందించడం లేదన్నారు. మాయమాటలు మోసపూరిత హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు హామీలను అమలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇక నుంచి పోరుబాట తప్పదని.. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేదాక విడిచి పెట్టేది లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పిట్టల మహేందర్, పీఏసీఎస్ చైర్మన్ శ్రీపతి రవిందర్, స్వామి, రాజు, దేవేందర్ రావు, స్వామి, తదితరులు పాల్గొన్నారు.