ప్రతిపక్షం, నాగర్కర్నూల్: సార్వత్రిక ఎన్నికల తేదీల ప్రకటనకు ముందు నాగర్‌కర్నూలు వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. అబ్ కీ బార్ మోదీ సర్కార్.. మూడో సారి అధికారం తమదేనంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణలో కూడా బీజేపీ గాలి వీస్తుందని.. 400 సీట్లు గెలవడమే తమ లక్ష్యమంటూ మోదీ పేర్కొన్నారు. నాగర్‌కర్నూలు బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు.. అంటూ పేర్కొన్న మోదీ.. ఈ రోజు 2024 ఎన్నికల షెడ్యుల్ ప్రకటిస్తారన్నారు. ఎన్నికల తేదీల కంటే ముందే ప్రజలు ఫలితాలను ప్రకటించేశారన్నారు. నాగర్ కర్నూల్ లో జన సందోహం అదే చెబుతోందని.. ఇంత పెద్ద మొత్తంలో స్పందన నిన్న మల్కాజ్ గిరిలో చూసానంటూ వ్యాఖ్యానించారు. పెద్ద మొత్తంలో వృద్దులు, పిల్లలు, మహిళలు అందరూ రోడ్డు పైకి వచ్చి బీజేపీకి మద్దతు తెలిపారన్నారు. ఇది చూసి చాలా అద్భుతంగా అనిపించిందన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల్లో బీఆర్ఎష్ పై విపరీతమైన కోపం చూసానని.. తెలంగాణ ప్రజలు మోదీని తిరిగి ఎన్నుకోవాలని చూస్తున్నారన్నారు. మూడోసారి మోదీ సర్కార్.. అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణను గెట్ వే ఆఫ్ సౌత్ అంటారని కోడ్ రాక ముందే ఇక్కడి ప్రజలు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని.. విమర్శించారు. తెలంగాణ అభివృద్ధిని రెండూ పార్టీలు అడ్డుకుంటున్నాయన్నారు. గత 10ఏళ్లలో ఎన్డీయే ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం కృషిచేసిందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ తో తెలంగాణకు ఒరిగేది ఏం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని.. రెండు పార్టీల తెలంగాణ ఆశయాలను నాశనం చేశాయంటూ పేర్కొన్నారు.
దేశ ప్రజల గుండెల్లో బీజేపీ ఉందని, ఈ సారి తమకు 400 సీట్లు రాబోతున్నాయని మోదీ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు తనను మళ్లీ ప్రధానిగా చూడాలనుకుంటున్నారని.. ఈ సారి తెలంగాణ నుంచి అత్యధికంగా సీట్లను గెలిపించాలని కోరారు. తమ పాలనలో అన్ని వర్గాల అభివృద్ధి జరిగిందని.. కానీ కాంగ్రెస్ పాలనలో దోచుకోవడమే సరిపోయిందని తెలిపారు. మోదీ కుటుంబం అంటే 140 కోట్ల భారతీయులు అని.. మోదీ గ్యారెంటీ అంటే అన్ని గ్యారెంటీల అమలు అంటూ ప్రధాని పేర్కొన్నారు.
గతంలో కాంగ్రెస్ పాలనలో పేదరిక నిర్మూలన జరగలేదని.. తమ హాయంలో కోట్లాది మంది పేదరికం నుంచి బయటపడ్డారంటూ మోదీ పేర్కొన్నారు. 70ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశం అభివృద్ధి చెందనలేదని.. తాము ఏంటో గత పదేళ్లలోనే చూపించామని పేర్కొన్నారు. తెలంగాణలో 67 లక్షల మందికి ముద్ర లోన్లు ఇచ్చామని మోదీ పేర్కొన్నారు.తెలంగాణలో 17కు 17 లోక్ సభ స్థానాలను గెలిపించాలని.. తెలంగాణలోనూ కమలం వికసించాలని మోదీ కోరారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామని.. మోదీ పేర్కొన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఆశీర్వదించాలని మోదీ కోరారు. కుటుంబ పార్టీలు దోచుకున్నాయని.. అవినీతి చేసిన వారిని వదిలిపెట్టమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, నాగర్కర్నూల్ బీజేపీ అభ్యర్థి, పోతుగంటి భరత్ ఎంపీ పోతుగంటి రాములు, మహబూబ్నగర్ అభ్యర్థి డికె అరుణతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.