ప్రతిపక్షం,స్టేట్ బ్యూరో, హైదరాబాద్ మార్చి 25: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నతస్థాయి అధికారులతోపాటు, గత ప్రభుత్వంలో పనిచేసిన ఇద్దరు మంత్రులకు ఉచ్చు బిగుస్తున్నది. మొదట అధికారులను అరెస్టు చేసిన పోలీసులు వారి నుండి కీలకమైన సమాచారాన్ని రాబట్టారు. విచారణ చేస్తున్న పోలీసులకు అరెస్టు అయిన అధికారుల నుండి అశ్చర్యకరమైన అంశాలు తెలుస్తున్నాయి. ఇందులో పాత్రదారులను అరెస్టు చేసి విచారిస్తున్న అధికారులు పూర్తి ఆధారాలతో సూత్రధారులను కూడా అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగా ఇద్దరు మంత్రులకు సీఆర్పీసీ సెక్షన్ 41ఎ కింద నోటీసులు అందివ్వనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అదే జరిగి మంత్రులను విచారిస్తే రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనానికి దారితీసే అవకాశముంది. ఇప్పటికే ఈ కేసులో ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావుతోపాటు మరో ఇద్దరు పోలీసు అధికారులు భుజంగరావు, తిరుపతన్నను అరెస్టు చేసి కీలక సమాచారం సేకరించారు.
ప్రణీత్ రావు మొదట్లో ససేమిరా అన్నప్పటికీ ఫోన్ ట్యాపింగ్ విషయాలు చెప్పక తప్పడం లేదు. ప్రణీత్ రావు పరిస్థితిని అంచనా వేసిన భుజంగరావు, తిరుపతన్న పోలీసులు అరెస్టు చేయగానే కీలక విషయాలు బహిర్గతం చేసినట్లు తెలిసింది.ఈ వ్యవహారంలో మరో ఇద్దరు సీఐ స్థాయి అధికారులను ఒకట్రెండు రోజుల్లో అరెస్టు చేసే అవకాశాలున్నాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసులో ఏ1 గా ఉన్న ఇంటలీజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కూడా విచారణ బృందంలోని కీలక అధికారితో మాట్లాడినట్లు సమాచారం. అందులో తమ తప్పేమి లేదని, ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకున్నట్లు చెప్పినట్లు తెలిసింది. తాను సహకరిస్తానని, క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వచ్చానని, చికిత్స తీసుకుని మరో మూడు నెలల్లో వస్తానని వివరించినట్లు సమాచారం. వీటితోపాటు కొంత సమాచారాన్ని కూడా ప్రభాకర్ రావు అందజేశారు. దీని ఆధారంగా మంత్రులకు ఉచ్చు బిగుసుకోనుంది.
గత మంత్రులు పరేషాన్..
పోన్ ట్యాపింగ్ విషయంలో గత ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులకు భయం పట్టుకుంది. అరెస్టు అవుతున్న అధికారులు వెల్లడిస్తున్న అంశాల్లో వారి పేర్లు కీలకంగా మారడంతో వారి అరెస్టు ఖాయమనే సంకేతాలు కనబడుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువులైన ఇద్దరు మంత్రుల మెడకు ఇది చుట్టుకోనుంది. అందులో అత్యంత సమీప బంధువు కాగా మరొకరు దూరపు బంధువు ఉన్నారు. ఇద్దరు మంత్రుల్లో ఒకరు సీనియర్ మంత్రి కాగా, మరో వ్యక్తి రాజకీయంగా అనుభవం ఉండి సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత క్యాబినెట్ లో మొదటిసారిగా మంత్రి పదవి దక్కించుకున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కరు ఓడిపోయారు. సీనియర్ మంత్రిగా ఉన్న అతను ప్రస్తుతం ఎమ్మెల్యేగా గెలిచారు. వీరిద్దరి కనుసన్నలలో ప్రభాకర్ రావు నేతృత్వంలో ఆపరేషన్ జరిగిందనే పక్కా అధారాలు పోలీసుల వద్ద ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇద్దరు మంత్రులు తమ సామాజిక వర్గానికి చెందిన అధికారులను ఉద్దేశ్య పూర్వకంగా ఎంపిక చేసుకుని ప్రతిపక్షాలు టార్గెట్ గా వ్యవహారం నడిపారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ట్యాపింగ్ తో సంబంధమున్న ఇద్దరు మంత్రులు తప్పు చేసిన అధికారులతో పాటు జైలుకు వెళ్లక తప్పదని ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు.
హైదరాబాద్, వరంగల్ కేంద్రాలుగా ఆపరేషన్..
ఈ వ్యవహారాన్నంత హైదరాబాద్, వరంగల్ కేంద్రాలుగా నడిపినట్లు తెలిసింది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీజేపీ పార్లమెంటులు సభ్యుడు బండి సంజయ్, కిషన్ రెడ్డి, వీరి అనుచరులు,ఎమ్మెల్యేలు, రియల్టర్స్, బిల్డర్స్, హవాల వ్యాపారులు, ముఖ్య అధికారుల ఫోన్ నెంబర్లు ట్యాప్ చేసేవారని తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలను ఎక్కడికక్కడ కట్టడి చేయడానికి ఫోన్ ట్యాపింగ్‌ను వాడుకున్నట్లు తెలిసింది. అంతేకాకుండా ఇతర పార్టీల నాయకులను, ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకోవడానికి కూడా ట్యాపింగ్ వాడుకున్నారు.
ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని వీరు స్వప్రయోజనాలకు కూడా వాడుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వానికి అవసరమైన సమాచారాన్ని వీరిని పురమాయించిన వారికి చేరవేస్తూ.. తమకు ఆర్థికంగా ప్రయోజనం కలిగించే వారితో కొంతమంది పోలీసు అధికారులు ప్రైవేటు సెటిల్మెంట్లు చేసేవారని విశ్వసనీయ సమాచారం.బ్లాక్ మెయిల్ చేసి కోట్లాది రూపాయల అక్రమ ఆస్తులను కూడబెట్టుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కోసం ఇజ్రాయిల్ నుండి రూ.50 నుండి 100 కోట్లు ఖర్చు పెట్టి ట్యాపింగ్ సంబంధించిన ప్రత్యేక మెషినరీ తెప్పించినట్లు తెలిసింది.దీనిని హైదరాబాద్ లోని ఓ చానల్ కేంద్రంగా , వరంగల్ లో మంత్రికి సంబంధించిన సమీప బంధువు ఇళ్లు కేంద్రంగా ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపారు. వీరందరికీ నోటుసులు అందించేందుకు పోలీసు శాఖ సిద్ధమవుతున్నది. అయితే సదరు చానల్ యజమాని కూడా ప్రణీత్ రావు అరెస్టు కాగానే మారుమూల దేశంలో తలదాచుకున్నట్లు తెలిసింది. సదరు చానల్ యజమాని గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఒకాయనకు బినామీగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని పోలీసులు రాబట్టారని తెలిసింది.
నేటితో ముగియనున్న ప్రణీత్ రావు పోలీసు కస్టడి..
ట్యాపింగ్ కేసులో అరెస్టైన డీఎస్పీ ప్రణీత్ రావు కస్టడీ మంగళవారంతో ముగియనుంది. ఇప్పటికే రెండుసార్లు కస్టడికి తీసుకున్న పోలీసులు మరోసారి కస్టడీ కోరనున్నారు. ప్రణీత్ రావు తరపున వాదించే లాయర్లు బుధవారం బెయిల్ పిటీషన్ వేసే అవకాశముంది. గతంలో పోలీసు కస్టడీని చాలెంజ్ చేస్తూ.. ప్రణీత్ రావు వేసిన పిటీషన్ ను కోర్టు కొట్టేసింది.