ప్రతిపక్షం, దుబ్బాక, మే 1: అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కార్మికుల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని దుబ్బాక జూనియర్ సివిల్ ప్రథమ శ్రేణి న్యాయమూర్తి వేముగంటి తరణి అన్నారు. బుధవారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని హబ్సిపూర్ శివారులో ఉన్న శ్రీ లలితా పరమేశ్వరి ఇండస్ట్రీస్లో పనిచేస్తున్న కార్మికులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ చైతన్య సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం కార్మిక చట్టాలపై కార్మికులకు అవగాహన కల్పించారు. కార్మికులను నిర్మిత సమయం వరకు మాత్రమే పని చేయించాలని యాజమాన్యాలకు సూచించారు. పనిచేసే చోటా మహిళా కార్మికులపై వేధింపులు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలపై కార్మికులు అప్రమత్తంగా ఉండాలని దుబ్బాక ఎస్సై వి గంగరాజు సూచించారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లు యజమానులు చింతరాజు, నల్ల శ్రీనివాస్, పోలీస్ మరియు కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.