ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో ఆలిండియా 3వ ర్యాంకు సాధించిన తెలంగాణ యువతి అనన్య రెడ్డి.. విరాట్ కోహ్లీ తన ఇన్‌స్పిరేషన్ అని తెలిపారు. ‘ఆయన నా ఫేవరెట్ ప్లేయర్. ఎప్పుడూ వెనకడుగు వేయొద్దనే కోహ్లీ ఆటిట్యూడ్ అంటే నాకిష్టం. చేసే పనిలో ఫలితం ఎలా వచ్చినా నిరంతరం కష్టపడుతూనే ఉండాలన్న విషయాన్ని ఆయన నుంచే నేర్చుకున్నా’ అని అనన్య వెల్లడించారు.
UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 ఫలితాల్లో తెలంగాణకు చెందిన విద్యార్థిని అనన్య రెడ్డి సత్తా చాటిన విషయం తెలిసిందే. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన దోనూరు అనన్య రెడ్డి ఫస్ట్ అటెంప్ట్ లోనే మూడో ర్యాంక్ సాధించారు. ఆంత్రోపాలజీకి మాత్రమే కోచింగ్ తీసుకున్నానని, రోజుకు 12-14 గంటలు చదివేదానినని తెలిపారు. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో చిన్నతనంలోనే సివిల్స్ చదవాలని నిర్ణయించుకున్నట్లు ఆమె చెప్పారు.
సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డలకు బీఆర్‌ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ‘తొలి ప్రయత్నంలోనే 3వ ర్యాంక్ సాధించి తెలంగాణ ఖ్యాతిని చాటిన అనన్యకు ప్రత్యేక అభినందనలు. వరుసగా 2వ సారి తెలంగాణ బిడ్డకు 3వ ర్యాంక్ రావడం, సివిల్స్‌కు 60 మంది తెలుగువారు ఎంపికవడం చాలా ఆనందంగా ఉంది. ఎంపికైన వారు పూర్తి శక్తి సామర్థ్యాలతో దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.