ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 30 : గత శాసనసభ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థి రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గోరంగా ఓటమిపాలవడంతో.. పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు, ఆయా విభాగాల పదాధికారులు బీఆర్ఎస్ ను వీడి నేరుగా కాంగ్రెస్, బీజేపీలలో చేరడంతో నిర్మల్ నియోజకవర్గంలో ఒకేసారి బీఆర్ఎస్ కంచుకోట బద్దలైంది. దీంతో బీఆర్ఎస్ బలహీనపడింది. అయితే నిర్మల్ నియోజకవర్గం లో పార్టీకీ వైభవం తీసుకోరావడానికి గాను బీఆర్ఎస్ అధిష్టానం భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని సీరియస్ గా ముందు అడుగులు వేస్తుంది. బీఆర్ఎస్ లో ఉద్యమ కాలం నుంచి ఉండి శాశ్వత సేవలు అందిస్తున్న వారు ఇతర నాయకులను గుర్తించి వారికి జిల్లా ,నియోజకవర్గస్థాయి పదవులను అప్పగించే పనిలో బీఆర్ఎస్ అధిష్టానం పడింది. అందులో భాగంగానే ఉద్యమ కాలం నుంచి కీలక భూమిక పోషిస్తున్న మాజీ డిసిసిబి చైర్మన్ కోరిపల్లి రాం కిషన్ రెడ్డి కు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమిస్తూ బీఆర్ఎస్ అధిష్టానం ఉత్తర్వులను జారీ చేసింది.
జిల్లాలో ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్న లోకసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గంలో పార్టీ ఓటు బ్యాంకు నష్టపోకుండవుండేందుకు గాను ముందస్తు జాగ్రత్తలు తీసుకొని పార్టీలో మిగిలి ఉన్న వారికి ఆయా పదవులను అప్పగించి ఎట్టి పరిస్థితులలోనైనా నియోజకవర్గ నుంచి బీఆర్ఎస్ ఓటు బ్యాంకు నష్టపోకుండా ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కుకు ఓట్లు పడేలా చూసుకునే బాధ్యతను వీరికి అప్పగిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార రకాలు జోరుగా ప్రచారాలు కొనసాగిస్తుండగా ముఖ్య నేతలతో ఎలాంటి సభలు, సమావేశాలు మాత్రం జరపలేదు. కొరిపల్లి రాం కిషన్ రెడ్డి తెలుగుదేశం ఆవిర్భావం నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. టిడిపిలో పలు పదవులో ఉండి అనేక కార్యక్రమాలు నిర్వహించిన ఆయన మారిన రాజకీయ సమీకరణల కారణంగా ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్ లో చేరి జిల్లా ,రాష్ట్ర స్థాయి పదవులను చేపట్టారు. బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉంటున్న కొరిపల్లి రాం కిషన్ రెడ్డి సతీమణి కోరిపల్లి విజయలక్ష్మి రాం కిషన్ రెడ్డి కి గతంలో కేసీఆర్ చొరవతోనే జెడ్పి చైర్మన్ పదవి దక్కిందని చెబుతుంటారు. ఏది ఏమైనా నిర్మల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ను కాపాడుకునేందుకు అధిష్టానం చేస్తున్న ఈ ప్రయత్నాలకు భవిష్యత్తు పునాదులు ఏ విధంగా ఉంటాయో వేచి చూడవలసిందే.