ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: మరోసారి పార్లమెంట్ అభ్యర్థిని గెలిపిస్తే ఢిల్లీలో ఏది అంటే అది తీసుకురావచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలంలో ములకనూరు లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొన్నారు. ఆయనతో పాటుగా కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. అనంతరం ములకనూరు లో నిర్వహించిన భారీ ర్యాలీలో కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. అనంతరం ములకనూర్ చౌరస్తా లో జరిగిన కార్నర్ మీటింగ్ లో మంత్రి పొన్నం మాట్లాడారు. మే 13 న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలి చాల రాజేందర్ రావు ని గెలిపించండి.. మీ అందరి ఆశీర్వాదం తో హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలిచా.. మంత్రిని అయ్యానని తెలిపారు. మరింతగా ఈ నియోజకవర్గానికి మీ సమస్యలు అన్ని పరిష్కారం చేసి మీ అందరికీ మంచి జరగాలంటే నా చేతులు మరింత బలపరచండని మంత్రి పిలుపునిచ్చారు. మరోసారి పార్లమెంట్ అభ్యర్థిని గెలిపిస్తే ఢిల్లీలో ఏది అంటే అది తీసుకురావచ్చని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. నా తర్వాత వినోద్ కుమార్, బండి సంజయ్ ఎంపీగా వచ్చారు.. మల్కనూర్ అంబేద్కర్ సాక్షిగా అడుగుతున్న మీరు ఈ నియోజకవర్గానికి.. ఈ మండలానికి ఏం చేశారో అంబేద్కర్ సాక్షిగా చర్చ చేయడానికి సిద్దమా..? అని సవాల్ చేశారు. భీమదేవర మండలంలో అభివృద్ధి పై ఏ గ్రామానికి సంబంధించి అయినా సరే చర్చ చేయడానికి సిద్ధం.. రాబోయే కాలంలో మీ ఆశీర్వాదంతో గౌరవేల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తాం.. దేవాదుల పనులు పూర్తి చేస్తామన్నారు.
నరేంద్ర మోడీ బీజేపీ 400 సీట్లు అడుగుతుంది.. బీజేపీ మళ్ళీ వస్తే రిజర్వేషన్లు తొలగిస్తారు. ఎస్సీ, ఎస్టీ బీసీ లు ఒకసారి ఆలోచించండి.. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది.. రిజర్వేషన్లు తీసేసి అదానీ, అంబానీ లకి అప్పగిస్తారు. కాంగ్రెస్ వస్తే మోడీ అర్బన్ నక్సలిజం వస్తది అంటున్నారు.. ప్రధాని దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారు. అమిత్ షా మాట్లాడిన మాటలు వక్రీకరించారని.. ముఖ్యమంత్రి కి నోటీసులు ఇచ్చి అరెస్టు చెపించాల్ని బెదిరిస్తున్నారు. మీ బీజేపీ ప్రభుత్వానికి దమ్ముంటే అరెస్టు చేసి చూపించండన్నారు.