Trending Now

ఓటు కోసం.. స్వంతూళ్లకు బాట

కిక్కిరిసి పోయిన బస్​, రైల్వే స్టేషన్లు

చెక్​పోస్టుల వద్ద భారీ క్యూ..

చీమల దండుగా ఏపీ రహదారుల్లో వాహనాలు

ప్రతిపక్షం, స్టేట్​బ్యూరో, హైదరాబాద్​: లోక్​సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు స్వంతూళ్లకు బయలు దేరేందుకు వచ్చిన ప్రయాణీకులతో బస్సు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసి పోయాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్​లో లోక్​సభతో పాటు రాష్ట్ర శాసనసభకు ఈనెల 13న పోలింగ్​ జరుగుతుండడంతో బతుకు దెరువుకోసం, అలాగే ఉద్యోగాల కోసం స్వంతూరు విడిచి వెళ్లిన వారిని ఓటు వేసేందుకు భారీ ఎత్తున ఆఫర్లు విసిరినట్లు సమాచారం. కొంత మంది పార్టీల నేతలు విరిసిన ఆఫర్లకు, మరికొంత మంది ఓ టు హక్కు వినియోగించుకునేందుకు స్వంతూళ్లకు వెళ్తున్నారు.

శనివారంనాడు హైదరాబాద్​ నుంచి విజయవాడ, ఖమ్మం తదితర రహదారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. అలాగే ఎంజీ బస్​స్టేషన్​లో వేలాది మంది రాకతో బస్​స్టేషన్​ ప్రయాణీకులతో కిక్కిరిసి పోయింది. దీనితో పాటు సికింద్రాబాద్​, నాంపల్లి, కాచిగూడతో పాటు పలు రైల్వే స్టేషన్లు సైతం ప్రయాణీకుల రద్దీ పెరిగింది. విజయవాడతో పాటు ఏపీకి వెళ్లే బస్సులన్నీ స్టాండింగ్​తో వెళ్తున్నాయి. ఎలాగైన తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, తమకు నచ్చిన పార్టీ నేతను ప్రతినిధిగా ఎన్నుకోవాలన్న పట్టుదల ఓటర్లతో కనిపించింది.

బస్​, రైల్వే స్టేషన్లలో జనజాతర..

ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తమ నియోజకవర్గాలకు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్ నగరం ఎటు చూసినా బస్ స్టాపుల వద్ద బ్యాగులు పట్టుకుని యువత దర్శనమిస్తున్నారు. అటు సికింద్రాబాద్, నాంపల్లి, బేగంపేట్ రైల్వేస్టేషన్లలో రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఏపీకి వెళ్లే రైళ్ల దగ్గర జనజాతర కనిపిస్తోంది. ఇప్పటికే బస్సులన్నీ రిజర్వేషన్ అయిపోవడంతో ఖాళీ ఎక్కడా దొరక్క ట్రైన్స్‌కు వెళ్తున్నారు. రైలులో సీటు కోసం ఆరాటపడుతున్నారు. ఏపీకి వెళ్లే రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులుతెలిపారు . అలాగే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు అదనంగా పలు రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఏపీకి క్యూ కట్టిన వాహనాలు..

ఇదిలా ఉంటే కొందరు తమ సొంత వాహనాల్లోనూ పెద్ద ఎత్తున ఊర్లకు తరలివెళ్తున్నారు. దీంతో విజయవాడ-హైదరాబాద్ హైవేతో పాటు హైదరాబాద్​ కర్నూల్​ (రాయలసీమ) హైవే లో వాహనాలు చీమల దండులా బారులు తీరాయి. వారంతంతో పాటు ఆదివారం, సోమవారం పోలింగ్​ రోజు కూడా సెలవు కావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో స్వంతూళ్లకు ప్రయాణం అవుతున్నారు. ఉదయం నుంచే భారీగా వెళ్తున్నారు. పంతంగి.. కొర్లపహాడ్ టోల్ గేట్ల దగ్గర రష్ ఉండటంతో.. హైదరాబాద్‌ నుంచి ఏపీవైపు వెళ్లేందుకు ఎక్కువ టోల్ బూత్స్‌ ఓపెన్ చేశారు. అలాగే కర్నూల్​ హైవేలోని రాయికల్​ టోల్​గేటు వద్ద సహితం అదనంగా బూత్స్​ ఏర్పాటు చేశారు. అయినా కూడా వాహనాలు భారీ ఎత్తున క్యూకట్టాయి. ఉపాధి కోసం హైదరాబాద్ కు వచ్చిన వారు తిరిగి పల్లెబాట పడుతున్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ప్రైవేట్​ దోపిడీ..

ఇదే అదనుగా భావించి కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ పెద్ద ఎత్తున టికెట్ ధరలను పెంచేసింది. దీనిపై ట్రాన్స్ పోర్ట్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు విజ్ఙప్తి చేస్తున్నారు. అయితే ఆర్టీసీ బస్సు సర్వీసులు పరిమితంగా ఉన్నప్పటికీ ఎన్నికల కోసం మరిన్ని బస్సులు అందుబాటులో ఉంచుతామని తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. అదనపు బస్సులు నడుపుతున్నా అన్ని కూడా ఓవర్​లోడ్​లో ప్రయాణం చేస్తున్నాయి. పెద్ద ఎత్తున రద్దీగా ఉండే భాగ్యనగరం ఓట్ల జాతర నేపథ్యంలో బోసిపోయి తక్కువ ట్రాఫిక్ కనిపిస్తోంది.

Spread the love

Related News

Latest News