హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: హైదరాబాద్ లోక్‌సభలో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నాలను మొదలు పెట్టంది. హైదరాబాద్ లోక్‌సభ స్థానం ఏర్పడినప్పటి నుంచిఎంఐఎం అడ్డాగా మారింది. 2004 నుంచి ఈ నియోజకవర్గం మజ్లిస్‌దే..! ఒక్క మాటలో చెప్పాలంటే అసదుద్దీన్ కంచుకోట. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో గెలిచి నిలిచారయన. అంతకుమునుపు 1984 నుంచి 2004 వరకు సుల్తాన్ సలాఉద్దీన్ ఓవైసీ ఆరు పర్యాయాలు ఎంపీగా విజయం సాధించారు. అయితే.. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అసద్‌కు చెక్ పెట్టాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు దక్కడంతో కమలం పార్టీ ఫుల్ జోష్‌లో ఉంది. ఇదే జోష్‌లో పార్లమెంట్ స్థానాలను సైతం ఎక్కువగానే సాధించాలని వ్యూహ రచన చేస్తోంది. ఈ నేపథ్యంలోనే నోటిఫికేషన్‌కు ముందే తెలంగాణ నుంచి 9 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను హైకమాండ్ ప్రకటించింది.
హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా కొంపెల్లి మాధవీ లత ను ప్రకటించారు. అయితే ఈమె ఎవరు, అసదుద్దీన్‌పై గెలుస్తుందా? అని నియోజకవర్గం ఓటర్లు ప్రశ్నించుకుంటున్నారు. ఎవరీమె..? ఈమె బ్యాగ్రౌండ్ ఏంటి..? అని తెలుసుకునేందుకు జనాలంతా గూగుల్‌లో తెగ సెర్చ్ చేశారు. మరికొందరేమే.. హీరోయిన్ మాధవీలత అని కూడా అనుకున్నారు. అయితే.. అందరూ అనుకున్నట్లుగా ఈమె.. హీరోయిన్ కాదు. ప్రముఖ విరించి ఆస్పత్రుల చైర్ పర్సన్ కొంపెల్లి మాధవీ లత. ఈమె రిలిజీయస్ యాక్టివిటీస్‌లో చురుకుగా పాల్గొంటూ ఉండేవారు. ఎన్ఎసీసీ క్యాడెట్‌గా.. భరతనాట్య నర్తకీగా.. క్లాసికల్ మ్యూజికల్ సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఈమె లతామా ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ కూడా. హిందుత్వం, భారతీయ సంస్కృతిపై అనర్గళంగా మాట్లాడగలరు. మోదీ నాయకత్వానికి ఆకర్షితురాలైన మాధవీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. నాటి నుంచి పాతబస్తీలో ఎవరికెలాంటి సమస్య వచ్చినా పరిష్కారం చూపిస్తూ వస్తున్నారు. పాతబస్తీలో తరుచూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతూ ప్రజలతో మమేకం అవుతుంటారు. నిత్యం ప్రజల్లో ఉంటున్న మాధవీకి టికెట్ ఇస్తే బాగుంటుందని రాష్ట్ర నాయకత్వం నుంచి ఢిల్లీ పెద్దలకు ఓ నివేదిక వెళ్లడంతో.. అభ్యర్థిత్వాన్ని పరిశీలించి టికెట్ ఇచ్చినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
కలిసి వచ్చేనా..?
ఎదురులేని నేతగా ఎదిగిన ఓవైసీని ఈ సారి గట్టి దెబ్బ కొట్టాలన్నది బీజేపీ ప్లాన్. అందుకే ఈసారి అసద్‌ను ఓడించాలని నారీ శక్తిని రంగంలోకి దింపింది. వాస్తవానికి.. ఇప్పటికే రెండు మూడు సార్లు బీజేపీ అభ్యర్థి రెండో స్థానం దక్కించుకున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే ఓవైసీనీ ఓడించాల్సిందేనని ఆర్థిక బలం, అంగ బలం.. అన్ని విధాలుగా సరైన వ్యక్తిగా ఉన్న మాధవీలతను బీజేపీ బరిలోకి దింపిందని ఇన్‌సైడ్ టాక్. మరీ ముఖ్యంగా.. మజ్లిస్ పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నఅసదుద్దీన్‌కు హైదరాబాద్‌లోనే చెక్ పెట్టాలన్నది కమలనాథులకున్న మెయిన్ టార్గెట్. ఇందులో భాగంగానే ఇలా ప్రజల్లో గుర్తింపు ఉన్న మాధవీలతను తెరపైకి తెచ్చింది కమలం. ఈ ప్లాన్ ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో వేచి చూడాలి మరి.