ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది శివ భక్తులకు మహాశివరాత్రి రోజు అత్యంత ముఖ్యమైనదని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో నేడు(మార్చి 8న) భక్తులు వివిధ శివాలయాలను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన నాసిక్ త్రయంబకేశ్వర్ మహాదేవ్ ఆలయానికి ఈరోజు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆలయం వెలుపల క్యూలో నిల్చుని దర్శనం చేసుకునేందుకు వేచి చూస్తున్నారు. దీంతో ఉదయం నుంచే ఆలయ ప్రాంగణాలు మొత్తం శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. మహారాష్ట్రలోని నాసిక్‌లో గోదావరి నది ఒడ్డున త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం స్థాపించబడింది. ఈ ప్రదేశంలో గౌతమ మహర్షి, గోదావరి సమిష్టిగా శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేశారనే పురాణం ఉంది. వారి తపస్సు ఫలితంగా ఇక్కడ శివుడు త్రయంబకేశ్వరుని రూపంలో వేలిశాడని చెబుతుంటారు.
మరోవైపు వారణాసిలోని కాశీ విశ్వనాథ దేవాలయానికి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా విశ్వనాథుని దర్శనం కోసం మొత్తం నాలుగు ప్రవేశ ద్వారాలను తెరిచారు. దీంతో ఆయా ద్వారాల నుంచి భక్తులు ఆలయ ప్రవేశం చేసి సులభంగా దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు.