Mahesh Babu donated 50 lakhs to CMRF: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రత దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న సీఎం నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వరద బాధితులకు విరాళం అందించారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 లక్షల చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. దీంతోపాటు ఏఎంబీ తరఫున మరో రూ.10లక్షలను విరాళంగా ఇచ్చారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్‌లు తమ వంతుగా సహాయం చేశారు.
ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వరదలు వచ్చాయి. ఈ వరదలకు భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ విపత్తు సమయంలో పునరావాస కార్యక్రమాలకు, సహాయం అందించేందుకు పలువురు ప్రముఖులు, టాలీవుడ్ హీరోలు ముందుకొచ్చారు. వరద సహాయాన్ని అందించేందుకు మహేశ్ బాబు సైతం తనవంతుగా స్పందించారు. వరదల సమయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సిఎం సహాయ నిధికి చెరొక 50 లక్షల చొప్పున సాయాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సోమవారం జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో మహేశ్ బాబు నమ్రతా శిరోద్కర్ దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కు అందజేశారు.