Hyderabad Metro Timings Extended: గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 17న అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్లు నడుస్తాయని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అన్ని స్టేషన్ల నుంచి అర్ధరాత్రి 1 గంటకు బయల్దేరి 2 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటాయని వెల్లడించారు. నిమజ్జనం ముగిసే వరకు అవసరాన్ని బట్టి అదనపు రైళ్లు నడుపుతామని తెలిపింది. ఈ మేరకు హెచ్‌ఎంఆర్ఎల్, ఎల్ అండ్ టీ సీనియర్ అధికారులతో సమావేశమైన ఆయన నిమజ్జనం దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లపై సమీక్షించారు.
మరోవైపు, ఎంఎంటీఎస్ అదనపు ట్రిప్పులను తిప్పనున్నట్లుగా వెల్లడించింది. నిమజ్జనం రోజు నుంచి మరుసటి రోజు తెల్లవారుజాము వరకు ఎంఎంటీఎస్ సర్వీసులకు నడిపిస్తామని అధికారులు తెలిపారు. ఈ నెల 17, 18 తేదీల్లో ఎంఎంటీఎస్ సేవలను భక్తులు వినియోగించుకోవాలని కోరారు. 17వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 18వ తేదీ తెల్లవారుజామున 4 గంటల వరకు సర్వీసులు నడుపుతున్నట్లుగా వివరించారు.