ప్రతిపక్షం, నిజామాబాద్ బ్యూరో, మార్చి 21: అకాల వర్షం వల్ల పంట దెబ్బతిన్న ప్రతీ ఎకరానికి రూ.10 వేల నష్టపరిహారం ప్రభుత్వం అందిస్తుందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. రైతులు ధైర్యం కోల్పోవద్దని అన్నారు. గురువారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని సిరికొండ మండలం కొండూరు, పెద్ద వాల్గోట్ గ్రామాల్లో అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలను, కల్లంలో తడిసిన ధాన్యాన్ని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డితో కలిసి పరిశీలించారు.. అకాల వర్షాలతో నష్టపోయిన పంటలపై అధికారులు సర్వే చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం ఉంచండి. కాంగ్రెస్ పాలనలో రైతులకు ఇబ్బందులు ఉండవని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం నిరంతరం రైతుల పక్షానే నిలబడుతుందన్నారు. ఉచిత కరెంటు, రైతు భరోసా, పంటల బీమా పథకం, రైతు నేస్తం లాంటి పథకాలతో రైతుల్లో భరోసా నింపుతున్నారని తెలిపారు.
ఇప్పటి వరకు 4,295 కోట్ల రూపాయలను రైతుభరోసా ( రైతుబంధు) పథకం క్రింద రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేశామని, 4 ఎకరాలకు పైన ఉన్న రైతులకు వారం రోజుల్లో నగదు బదిలీ చేస్తామని వెల్లడించారు. పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని, రైతులకు వచ్చే సబ్సిడీలు, పంటల బీమా లాంటి అనేక పథకాలకు చరమగీతం పాడిందని వెల్లడించారు. పంటల బీమా పథకాన్ని తమ ప్రభుత్వం పునరుద్ధరించిందని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేశామని వెల్లడించారు.