ప్రతిపక్షం, తెలంగాణ: అయోధ్య రాముడి జన్మంపై బీజేపీ ఎంపీ బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయోధ్య రాముడి విషయంపై కాంగ్రెస్ నేతలపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని బండి స్పష్టం చేయగా.. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా స్పందిస్తూ.. బీజేపీ ఎంపీపై విరుచుకుపడ్డారు. బండి సంజయ్ రాజకీయ డ్రామాకు తెర లేపారని మండిపడ్డారు. కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధికి ఎంపీగా ఏం చేశావో చెప్పి యాత్ర చేయాలని తాను అన్నట్లు తెలిపారు.
రాముడి జన్మంపై నేన్నడూ మాట్లాడ లేదు. నేనని మాటను నాకు ఆపాదిస్తూ తల్లి జన్మపై మాట్లాడటం దుర్మార్గం. తల్లి ఎవరికైనా తల్లే.. అలాంటి మాటలు తప్పు.. మేమేవరం ఆయన యాత్రను అడ్డుకోవడం లేదు. బండి మాటలను మీరు సమర్థిస్తున్నారా అని నేను బీజేపీ అధ్యక్షుడిని అడుగుతున్న. కరీంనగర్ అభివృద్ధికి సంబంధించి బహిరంగ చర్చకు నేను సిద్ధం. ఓటమి భయంతోనే బండి ఇలాంటి మాటలు మాట్లాడుతూ రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు అమ్మ గురించి నువ్వు మాట్లాడిన మాటల్తో నీ రాజకీయ జీవితం అంతరించిపోవడం ఖాయం అని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.