ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 8 : పదేళ్ల మోసపూరితమైన ప్రధాని నరేంద్ర మోడీ పాలనకు ప్రజలు చర్మ గీతం పడేందుకు సిద్ధంగా ఉన్నారని.. కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే దేశం సస్యశ్యామలమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా లక్ష్మణ చాంద మండలంలోని బాబాపూర్ లో ఉపాధి హామీ కూలీలతో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 60 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో సుస్థిర పాలనను అందించి అన్ని వర్గాలకు సమన్యాయం సమసంక్షేమమే చేసింది.. తప్ప కులాలు వర్గాల మధ్య వైశాల్యాలను సృష్టించలేదన్నారు.
బీజేపీ వారు అభివృద్ధి గురించి అడిగితే అక్షింతలు ఇచ్చి రాముడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏ ఒక్క ఆలయానికి నయా పైసా ఇవ్వలేని ఘనత బిజెపి అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు ఎవరుకైనా ఇక్కడ తెలుసా అని అడగగా.. అసలైన ఎవరో కూడా తెలియదని ప్రజల నుంచి జవాబు రావడంతో చప్పట్ల స్వరాలు మారుమోగాయి. బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ గతంలో ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా,ఎంపీగా పనిచేశాడని కనీసం అతనైనా మీకు తెలుసా అని మహిళలను అడగగా తెలియదంటూ.. మాకు తెలిసింది సోనియాగాంధీ,ఇందిరాగాంధీ రాహుల్ గాంధీలేనని చెప్పకొవచ్చారు. జిల్లా ఇన్చార్జి మంత్రిగా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి ఊరిలో అభివృద్ధి పనులు చేయించుకునే బాధ్యత తనదని తనకు సహకరించాలని కోరారు. అదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నిరుపేద బిడ్డ ఆదివాసి ఆత్రం సుగుణను ఎంపీగా గెలిపించుకుంటే సుస్థిర,స్థానిక ప్రజాపాలన కొనసాగడం సులభం అవుతుందని చెప్పారు. బీజేపీ వారికి ప్రభుత్వం పోతున్నదనేఆందోళన ఉంటే.. బీఆర్ఎస్ వారికి మాత్రం ప్రభుత్వం పోయిందన్న బెంగతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
గుడి, బడి, గ్రామాల్లో అభివృద్ధి చేసే బాధ్యత నాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణక్కతో కలిసి పాల్గొన్నారు. ఉపాధి హామీ పనుల వద్దకు చేరుకుని ఉజ్వలమైన దేశ భవిష్యత్తు కొరకు, దేశ అభ్యున్నతి కొరకు త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ నాయకత్వాన్ని దేశానికి అందించడమే లక్ష్యంగా హస్తం గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి సుగుణక్క మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ అని, ఇప్పుడు కూలీలకు రోజుకు 400 రూపాయలు చెల్లించటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా తనకు ఓటు వేసి గెలిపిస్తే కూలీల సమస్యల పరిష్కారం కోసం మీ గొంతుగగా ఢిల్లీలో మాట్లాడుతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీ హరి రావు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.