నిర్మల్ లో రాష్ట్ర మంత్రి సీతక్క..
నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి) ఏప్రిల్ 8 : పదేళ్ల కాలంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అభివృద్ధి అడిగితే అక్షింతలు ఇవ్వడం.. ఈడీలను పంపి భయపెట్టడం లాంటి చర్యలకు పాల్పడుతూ ప్రజలను మోసగిస్తున్నదని రాష్ట్ర మంత్రి సీతక్క ఆరోపించారు. సోమవారం నిర్మల్ పట్టణంలోని ఏం రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ బూత్ స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రపంచం మొత్తం గ్లోబలైజేషన్ విధానాలను అనుసరిస్తూ కుల మతాలకు అతీతంగా ముందుకు వెళ్తుంటే బీజేపీ మాత్రం మత ఘర్షణలు మత విమర్శలు చేస్తూ.. దేశాని అధోగతి పాలు చేస్తున్నదని ఎద్దేవ చేశారు.
చివరికి దేవుళ్లకు నైవేద్యాల రూపంలో పూజల రూపంలో సమర్పించుకునే వాటిపై కూడా మోడీ ప్రభుత్వం జీఎస్టీలను విధించిందని ఆమె ఈ సందర్భంగా విమర్శించారు. ప్రతి సంస్థను ప్రైవేటీకరణ చేస్తూ.. కార్పొరేషన్ విధానాలను అనుసరిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి తగిన విధంగా గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. చివరికి దేశ రక్షణ కోసం కష్టపడే సైనికులను కూడా తమ రాజకీయ స్వార్థాల కోసం వాడుకొని మోడీ తన ప్రియా మిత్రులైన ఆదాని, అంబానీల లాభాల కోసం కష్టపడుతున్నాడని ఆరోపించారు. వ్యవసాయ రంగాన్ని ఇతర రంగాలన్నింటిని సర్వనాశనం చేసిన ఘనత బిజెపి దేనిని ఆమె ఈ సందర్భంగా మండి పడ్డారు.