రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పంట నష్టం అంచనా వేస్తున్నామని తెలిపారు. వర్షాలు పూర్తిగా తగ్గాక సర్వే చేసి ప్రభుత్వం పరిహారం అందిస్తుందన్నారు. ఇక, నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టును సైతం మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు. అనంతరం ఖానాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్మల్ జిల్లా అధికారులతో మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు.
కడెం ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు కేటాయించి మరమ్మత్తులు పూర్తీ చేశామన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో భారీగా వరద కొనసాగుతోందని, ఇన్ ఫ్లోలు, ఔట్ ఫ్లోపై అధికారులు ఎప్పటి అప్పుడు అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు వద్ద చేపట్టిన చర్యలపై మంత్రి శ్రీధర్ బాబు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా యంత్రాంగం చర్యలు చేపట్టాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.