- ఐక్యతను చాటేవే విజయ దశమి వేడుకలు
- ప్రధాని మోదీ సుస్థిర పాలన ప్రపంచానికి ఆదర్శం
- ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
MLA Alleti Maheshwar Reddy: సనాతన ధర్మ పరిరక్షణ అందరి బాధ్యత అని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ పట్టణంలోని బంగల్ పేట్ మహాలక్ష్మి ఆలయ పరిసరాల్లో వీహెచ్‌పీ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయదశమి వేడుకల సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విజయదశమి వేడుకలు హిందువుల ఐక్యతను చాటుతాయని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే బలవంతంగా మారిందన్నారు. దీంతో విదేశాల్లో భారతీయులకు గౌరవం పెరిగిందని తెలిపారు. త్వరలోనే కామన్ సివిల్ కోడ్‌ను ప్రజాస్వామ్య పద్ధతిలో అమలులోకి తెచ్చి వక్ఫ్ బోర్డ్‌ను కూడా రద్దు చేసే దిశగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. నిజాం నిరంకుశ పాలనలో ఆత్మ బలిదానాలు చేసిన త్యాగమూర్తుల త్యాగాలను మరువలేమన్నారు. అనంతరం అమరులైన వారికి ఆయన ప్రగాఢ నివాళులర్పించారు. నిజాం నవాబుల కాలంలో ఏర్పడిన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, హైదరాబాద్, మహబూబ్ నగర్ ఇలాంటి పేర్లను మార్చడమే లక్ష్యంగా ప్రణాళికతో తెలంగాణ బీజేపీ ముందుకెళ్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా హిందూ సనాతన ధర్మ విలువలను తెలుసుకొని సఖ్యతతో హక్కుల సాధన సమస్యల పరిష్కారం కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
రెచ్చగొట్టేలా ఏలేటి ప్రసంగం
ఒక సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టేలా విజయదశమి వేడుకల వేదికపై నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తన ఉపన్యాసాన్ని కొనసాగించడంపై పలువురు విమర్శలు చేశారు. విజయదశమి వేడుకలకు సంబంధించిన ఔన్నత్యాలను చెబుతూనే మరోవైపు ఓ సామాజిక వర్గంపై ఎమ్మెల్యే రెచ్చిపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. పండగ వేడుకల్లో ఎమ్మెల్యే ఇలాంటి మాట్లాడడం సరికాదని వ్యాఖ్యానిస్తున్నారు.
రావణుని దహనం
నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్ పేట్ మహాలక్ష్మి ఆలయంలో విజయదశమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా ఎస్పీ డాక్టర్. జి .జానకి షర్మిల, డీఎస్పీ అల్లూరి గంగారెడ్డి, పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్, ప్రజా ప్రతినిధులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రావణ దహన కార్యక్రమంలో పాల్గొన్నారు.