రైతులను ఆదుకోండి.. ఎమ్మెల్యే చింత ప్రభాకర్
ప్రతిపక్షం, సంగారెడ్డి ప్రతినిధి, మే 18: గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతులకు అపార నష్టం జరిగిందని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తూ, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాలి దుమారానికి తీవ్రంగా పంట నష్టం జరిగింది. మామిడి కాయలు రాలిపోయాయి. ఇతర పంటలు నేలకొరిగాయి. పట్టణంలో గాలి దుమారానికి చెట్లు నేలకొరిగాయి. రోడ్లపై వరద నీటితో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. కలెక్టర్ కానీ ఎవరూ క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి వస్తే, మంత్రులు, కలెక్టర్‌లంతా ప్రజలతోనే ఉండి సమస్యలు పరిష్కరించిన విషయాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. అకాల వర్షాలు, వడగండ్ల వానలకు వెంటనే అధికారులు గ్రామాల్లో పర్యటించి, రైతులకు తక్షణ సాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎంత పెద్ద వర్షాలు కురిసినా సరే, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూసుకున్నాం. వర్ష సూచన వస్తే చాలు కాంగ్రెస్ పాలనలో కరెంట్ పోతుంది అని అన్నారు.