హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: రాష్ట్రంలో పనికిమాలిన కాంగ్రెస్ పాలన కొనసాగుతున్నదని, ఈ పాలనను పాతర వేయాల్సిందేనని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తిప్పారం గ్రామానికి చెందిన హర్యల వెంకట్ బోధన్ హాస్టల్‌లో జరిగిన చిన్న సంఘటనలో మృతి చెందడం చాలా బాధాకరమైన విషయమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. హాస్టల్ వార్డెన్, వాచ్‌మెన్ లేకపోవడం వలన జరిగిన చిన్న సంఘటనలో ఒకరు చనిపోవడం ఎనిమిది మంది విద్యార్థులపై మర్డర్ కేసు నమోదైంది. మర్డర్ కేసు నమోదు కావడం వల్ల ఎనిమిది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని కవిత మండిపడ్డారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థత, పట్టింపులేని చర్యల వల్లనే ఈ సంఘటన జరిగింది అని కవిత ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై పడి ఏడ్చుడే తప్ప ఈ మూడు నెలల్లో ప్రజలకు చేసిందేమీ లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థుల చావులు చూశామంటే, మళ్ళీ గత మూడు నెలల నుంచి చూస్తూనే ఉన్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు విద్యా శాఖకు మంత్రి లేకపోవడం మన దురదృష్టం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా రివ్యూ నిర్వహించి పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇదేనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన అని కవిత నిలదీశారు.
ఇప్పటికైనా గురుకుల పాఠశాలల్లో వాచ్‌మెన్ లేకపోతే ఒక పోలీస్ కానిస్టేబుల్‌ని నియమించాలని జిల్లా కలెక్టర్‌ను కోరామని కవిత తెలిపారు. మృతుని తల్లికి పెన్షన్, సోదరునికి ప్రభుత్వ ఉద్యోగం, రూ. 15 లక్షల నష్టపరిహారం, ఒక డబుల్ బెడ్ రూం ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ఎస్ భావజాలాలు ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయి. బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటే అన్న రేవంత్ రెడ్డి నిన్నటి సభలో మోదీ పెద్దన్న అనడంతో రేవంత్ రెడ్డి నిజస్వరూపం బయటపడిందన్నారు. బీజేపీ కాంగ్రెస్ ముమ్మాటికీ ఒక్కటే.. ప్రాంతీయ పార్టీలు ఉండొద్దనేది ఇరు పార్టీల లక్ష్యం అని ఆమె పేర్కొన్నారు.
ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న రేవంత్ ప్రధాని మోదీని పెద్దన్న అనడంలో అతిశయోక్తి లేదు. కానీ తెలంగాణకు బడ్జెట్‌లో ఒక్క రూపాయి కేటాయించకపోవడంపై ఎందుకు ప్రశ్నించలేదు? రేవంత్ రెడ్డికి పబ్లిసిటీ మీద ఉన్న ధ్యాస ప్రజా సమస్యల మీద లేదు. కేసీఆర్‌ను మాటలు అనడానికి మాత్రమే రేవంత్ సీఎం అయినట్టు అన్నారు. పొలిటికల్ స్పీచ్‌లు తప్ప రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదు. విద్యార్థుల వరుస ఆత్మహత్యలు జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. భువనగిరిలో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు నిరసన తెలిపితే అరెస్ట్ చేస్తారా..? ఇదేనా కాంగ్రెస్ చెబుతున్న మార్పు. పిల్లలు చనిపోతున్న కూడా రాజకీయాలు చేస్తున్నారు అని కవిత మండిపడ్డారు.