హైదరాబాద్ , ప్రతిపక్షం స్టేట్బ్యూరో: అగ్నిమాపక వారోత్సవాల ముగింపు సందర్భంగా మాదాపూర్‌లో అగ్నిమాపక శాఖ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ.. జంట నగరాల్లో 6 వేలకు పైగా బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులు ఇచ్చామని తెలిపారు. బహుళ అంతస్తుల భవనాల్లో అగ్నిప్రమాదాలు జరిగితే ఏ విధంగా స్పందించాలి అనే విషయాలపై వారోత్సవాల్లో అవగాహన కల్పించామని చెప్పారు. రాబోయే కాలంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు తరచూ నిర్వహిస్తామన్నారు. మరో రెండు నెలల్లో 39 శకటాలు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. వీటితో పాటు చిన్న సైజులో ఉండే అగ్నిమాపక శకటాలు కూడా అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. వర్షాకాలంలో వరదల వలన ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామని డీజీ నాగిరెడ్డి స్పష్టం చేశారు.