దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ డిమాండ్
ప్రతిపక్షం, గజ్వేల్, ఏప్రిల్ 24: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనాలు చెల్లించకుండా కేంద్ర ప్రభుత్వం శ్రమ దోపిడీకి గురిచేస్తుందని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి. శంకర్ ప్రశ్నించారు. మహనీయుల జయంతుల మాస ఉత్సవం సందర్భంగా డీబీఎఫ్ చేపట్టిన భారత రాజ్యాంగ పరిరక్షణ ప్రచారంలో భాగంగా బుధవారం నాడు గజ్వేల్ మండలం జాలిగామ చెరువులో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉపాధి కూలీలకు కనీస కూలి 300 రూపాయలు పెంచినప్పటికీ ఆచరణలో కూలీలకు 70 నుంచి 100 రూపాయల లోపే చెల్లిస్తున్నారని ఆరోపించారు. ఉపాధి హామీ చట్టం ప్రకారం.. వేసవికాలంలో కూలీలకు చెల్లించాల్సిన సమ్మర్ అలవెన్స్ ను తాగునీటి చార్జీలను, పనిముట్లైనా గడ్డపార, పారలను అందించకపోవడంతో కూలీలు ఇబ్బందుల పాలు అవుతున్నామని తమ దృష్టికి తెచ్చారని శంకర్ చెప్పారు.
ఉపాధి పని ప్రారంభమైన 20 ఏళ్ల కింద పంపిణీ చేసిన గడ్డపారలు,పారలు చూపిస్తూ.. కూలీలు వీటితో ఎలా పనిచేయాలని ప్రశ్నించారన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ హాజరు పేరుతో అమలు చేస్తున్న నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం వల్ల కూలీల హాజరు తీసుకోవడం చాలా ఇబ్బందిగా మారింది అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సక్రమంగా లేకపోవడం వల్ల కూలీలు పనికి వచ్చిన హాజరు తీసుకోవడం ఆలస్యం అవుతుందన్నారు. దీనివల్ల ఎండాకాలంలో వారి సమయము వృధా అవుతుందన్నారు. ఆన్లైన్ హాజరు రద్దుచేసి కూలీలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస కూలి 300 చెల్లించాలని తాగునీటి చార్జీలను చెల్లించాలని, గడ్డపార, పారా గంప తదితర పనిముట్లను అందజేయాలని డిమాండ్ చేశారు.
గత సంవత్సరం క్రితం గిరిపల్లి రోడ్ పెద్ద అరేపల్లి రోడ్డు లో చేసిన పనికి వేతనాలు చెల్లించలేదని కూలీలు ఆవేదన చెందారని శంకర్ చెప్పారు. పనిచేసినట్లు పేస్లిప్లను పంపిణీ చేస్తే తామెంత పనిచేస్తున్నామో తమకు ఎంత వేతనం పడుతుందో తెలుస్తుందని కూలీలు చెప్తున్నందున తక్షణమే కూలీలకు పేస్లిప్లను చెల్లించాలని శంకర్ డిమాండ్ చేశారు. పని వద్ద సౌకర్యాలను హక్కుగా అందించకుండా కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని ఉల్లంఘిస్తుందని ఆరోపించారు పని దినాలను 100 నుండి 200 రోజులకు పెంచాలని బడ్జెట్ను సైతం పెంచాలని డిమాండ్ చేశారు. వికలాంగులకు, ఒంటరి స్త్రీలకు సంవత్సరానికి 250 రోజుల పని దినాలను కల్పించాలని కోరారు.
చేసిన పనికి చట్టం ప్రకారం.. 15 రోజుల్లో వేతనం చెల్లించనందున నష్టపరిహారాన్ని కూలీలకు అందించాలని శంకర్ డిమాండ్ చేశారు. ఎర్రటి ఎండలో పనిచేస్తున్న కూలీలు వడదెబ్బకు గురికాకుండా ఆరోగ్య సిబ్బంది ఓ ఆర్ ఎస్ వడదెబ్బ నివారణ మందులను పని ప్రదేశాలలో కూలీలకు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో ఉపాధి హామీ పథకాన్ని సక్రమంగా అమలు చేస్తామని బడ్జెట్ పెంచుతామని, పని దినాలను 200 రోజులకు పెంచుతామని, కూలీలకు ప్రమాద బీమా, రైతు బీమా లాగా 5 లక్షలు పెంచుతామని ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో మేనిఫెస్టోలో హామీ ఇవ్వాలని శంకర్ డిమాండ్ చేశారు. ఉపాధి చట్టాన్ని అడుగడుగునా ఉల్లంఘిస్తూ నిధులను తగ్గిస్తున్న, భారత రాజ్యాంగాన్ని మారుస్తామని బరితెగించి ప్రకటిస్తున్న బీజేపీని ఓడించాలని.. భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని శంకర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గత సంవత్సరం 100 రోజుల పనిని తినాలని పూర్తిచేసిన కూలి రాజలింగం గౌడ్ కుటుంబాన్ని అదేవిధంగా మేటుగా సక్రమంగా విధులు నిర్వహిస్తున్న కృష్ణను శంకర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో డిబిఎఫ్ జిల్లా కార్యదర్శి బ్యాగరి వేణు తదితరులు పాల్గొన్నారు.