Trending Now

ఏపీలో కొత్త మంత్రులు.. 17 మందికి జాక్‌పాట్

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరనుంది. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధమైంది. కాసేపట్లో అమరావతి అధిపతిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ వేడుక కోసం కృష్ణాజిల్లా గన్నవరంలోని కేసరపల్లి గ్రామం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ విశిష్ట అతిథిగా రానున్నారు. కేసరపల్లిలోని ఐటీటవర్‌ వద్ద ఈ రోజు ఉదయం 11.27 గంటలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేయనున్నారు.

ఇక, ఈ ప్రభుత్వంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్న వారి జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక విడుదల చేశారు. మొత్తం 24 మందికి ఈ లిస్టులో చోటు దక్కింది. టీడీపీ నుంచి చంద్రబాబుతో పాటు మొత్తం 20మంది కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. జనసేన నుంచి ముగ్గురికి, బీజేపీ నుంచి ఒకరికి మంత్రి పదవి లభించింది. జనసేనాని పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేశ్‌కు మంత్రివర్గంలో చోటు లభించింది. ఎనిమిది మంది బీసీలు, నలుగురు కమ్మ, నలుగురు కాపు, ముగ్గురు రెడ్లు, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, మైనార్టీల నుంచి ఒకరని, వైశ్యుల నుంచి ఒకరిని పదవి వరించింది. మొత్తంగా 17 మందికి జాక్‌పాట్ తగిలింది. వీరందరూ తొలిసారి మంత్రి పదవి చేపట్టనున్నారు. వీరిలో పది మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. ముగ్గురు మహిళలకు చోటు దక్కింది.

అయితే.. మంత్రి పదవులు ఆశించిన పలువురు సీనియర్ నేతలకు నిరాశ ఎదురైంది. వారిలో బుచ్చయ్య చౌదరి, అయ్యన్న, ధూళిపాళ్ల నరేంద్ర, గంటా శ్రీనివాసరావు, యరపతినేని శ్రీనివాసరావు, బొండా ఉమ, గద్దె రామ్మోహన్, బాలకృష్ణ, పరిటాల సునీత, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, జీవీ ఆంజనేయులు వంటి వారు ఉన్నారు. అలాగే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, భారీ మెజార్టీతో గెలిచిన పల్లా శ్రీనివాసరావుకి కూడా నిరాశే ఎదురైంది.

Spread the love

Related News

Latest News