నిర్ణీత కాలంలో పనులు పూర్తి చేయాలి
నిర్మల్ జిల్లా విద్యాధికారి రవీందర్ రెడ్డి
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 22 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్న ‘అమ్మ ఆదర్శ పాఠశాలల’ అభివృద్ధి పనులలో భాగంగా చేపడుతున్న పాఠశాలల మరమ్మతు పనులను నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని నిర్మల్ జిల్లా విద్యాధికారి రవీందర్ రెడ్డి ఆదేశించారు. నిర్మల్ జిల్లాలోని మూడు నియోజకవర్గాలతో పాటు పలు మండలాలలోని పాఠశాలలను చేపడుతున్న మరుగుదొడ్లు మూత్రశాలల నిర్మాణాలు మరమ్మతులు ఇతర పనులను నిర్ణీతకాలంలో వెంటనే పూర్తి చేయాలని పేర్కొన్నారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై లోపు సదరు పనులను పూర్తి చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు.
నిర్మల్ జిల్లా కలెక్టర్ ఈ విషయంలో సీరియస్ గా ఉండి వ్యక్తిగతంగా అమ్మ ఆదర్శ పాఠశాలలను జరుగుతున్న మరమ్మతు నిర్మాణ పనులను పరిశీలించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హాయంలో జిల్లాలోని ఆయా ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలల భవనాల మరమ్మతులు అదనపు గదుల నిర్మాణాలు ఇతర పనులు మన ఊరు మనబడి పథకం కింద చేపట్టినా తగిన విధంగా నిధులు రాకపోవడంతో అర్థాంతరంగా నిలిచిపోయాయని తెలిపారు. ఈ పనులను కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలు, సూచనల మేరకు పూర్తి చేసి పాఠశాల భవనాలను శోభయామానంగా తీర్చిదిద్దడం జరుగుతుందని చెప్పారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభంలోపు పాఠశాలల్లో జరుగుతున్న వివిధ రకాల మరమతు పనులను పూర్తిచేసేలా కఠినమైన రీతిలో చర్యలు తీసుకుంటామని చెప్పారు.