Crypto Currency, Bitcoin: క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ పేర్లతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నట్లు నిర్మల్ జిల్లా ఎస్పీ జి. జానకి షర్మిల వెల్లడించారు. ముఠాలోని ప్రధాన నిందితుడు సళ్ల రాజేశ్ కుమార్‌ను పట్టుకొని విచారించగా.. అసలు విషయం బయటకు వచ్చింది. నిందితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నట్లు ఆమె చెప్పారు.
నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ఓ గ్రామంలో క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ పేర్లతో మొదలైన ఈ ఆన్‌లైన్ దందా జిల్లా మొత్తం వ్యాపించిందన్నారు. ముందుగా సళ్ల రాజేశ్ కుమార్‌తోపాటు గంగాధర్, మహేష్, సాయి కృష్ణతో కలిసి అమాయక ప్రజలను వలల వేసుకున్నారు. తొలుత పెట్టుబడి పెడితే 500 రోజుల్లో 5 నుంచి 10 రెట్లు లాభం వస్తుందని నమ్మించారు. యూనిట్ కాయిన్చ యూబిట్ కాయిన్ అనే ఆన్ లైన్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే డాలర్ రూపంలో డబ్బులు వస్తాయని చెప్పడంతో అమాయక ప్రజలు నమ్మారన్నారు.
ఒక్కొక్కరు రూ.3వేల నుంచి రూ.2,52,000 వరకు పెట్టుబడితో ఐదుగురిని చేర్చాలని, ఎంతమందిని చేర్చితే కమీషన్ పెరుగుతుందని చెప్పారన్నారు. దీంతో ఈ ఆన్ లైన్ దందా గొలుసుకట్టులా వేగంగా వ్యాపించిందన్నారు. దాదాపు రూ.50కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్లు పోలీసుల తనిఖీలో వెల్లడైంది. తర్వాత క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ వ్యాపారం మోసపూరితమని తెలుసుకున్న బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ నేతృత్వంలో ఒక బృందం చాకచక్యంగా పట్టుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. లక్ష పెట్టుబడి పెడితే 0.5 శాతం, కొత్త వ్యక్తులను చేర్పిస్తే 1 శాతం బోనస్ ఇస్తామని అమాయకులకు ఆశాపెట్టారన్నారు. అయితే ఇందులో ప్రారంభంలో చేరిన వారికి మాత్రమే ప్రయోజనం పొందుతారన్నారు. మొదట సళ్ల రాజ్ కుమార్ మెటా మాస్క్ లో ఖాతా తెరిచారని, తర్వాత యూబిట్ క్రిప్టోలో ఖాతా తెరిచారని వివరించారు. తర్వాత పెట్టిన పెట్టుబడికి రెట్టింపు వస్తుందని నమ్మించారు. అలా ఒక్కొక్కరిగా నిర్మల్ జిల్లా మొత్తం వ్యాపించిందన్నారు. ఎట్టకేలకు ఈ ముఠా ను పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు డీఎస్పీ అల్లూరి గంగారెడ్డి, టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, ఎస్‌ఐలు సాయి కృష్ణ, రవి, రవీందర్, కానిస్టేబుల్ తిరుపతి, గణేష్, శోకత్, సతీష్‌లను ఎస్పీ ప్రశంసించారు.