బీజే ఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 30 : కేంద్రంలో మరో సారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం చారిత్రక అవసరమని బీజేఎల్‌పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. భైంసా మండల కేంద్రంలో జరిగిన కుభీర్, భైంసా మండలాల కార్యకర్తల విస్త్రతస్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ ఎన్నికలలో విజయ పతాకాన్ని ఎగరవేయడమే లక్ష్యంగా దిశానిర్దేశం చేశారు. అబద్ధపు పునాదులపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోగా, పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కొత్త వాగ్దానాలను ఇస్తూ మళ్లీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని, ఈ విషయాన్ని ప్రజల్లో విస్త్రుతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రిజర్వేషన్ ల విషయంలో కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని, కానీ మహిళా రిజర్వేషన్ తో పాటు ఉన్నత వర్గాలలో ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్ ను అమలు పరిచిన ఘన చరిత్ర బీజేపీ పార్టీదని అలాంటి బీజేపీ పార్టీ పై రిజర్వేషన్ ల విషయమై కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.
అమిత్ షా ఎన్నికల సభ వీడియోను మార్ఫింగ్ చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రతి కార్యకర్త యుగపురుషుడైన నరేంద్రమోదీ ని మరో సారి ప్రధాని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ మాట్లాడుతూ.. ప్రస్తుతమున్న దేశ ఆందోళన పరిస్థితులలో దేశానికి మూడోసారి ప్రధాని మోడీ అవసరం అన్న విషయాన్ని అన్ని వర్గాల వారు గుర్తించారు అన్నారు. పదేళ్ల మోడీ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాలకు సమన్యాయం సమసంక్షేమం జరిగిందని సుస్థిర పాలనను అందించే సత్తా సామర్థ్యం ఒక ఎన్డీఏ ప్రభుత్వానికి ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ తోపాటు బీజేపీ జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.