Nitin Gadkari on Indians following road safety rules: రోడ్డు ప్రమాదాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిక్కీ రోడ్ సేఫ్టీ అవార్డ్స్, కాంక్లేవ్ 2024 కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రోడ్డు ప్రమాదాలపై మాట్లాడారు. దేశంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయన్నారు. ఇతర కారణాలతో చనిపోతున్న వారికంటే రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే వారే ఎక్కువగా ఉన్నారన్నారు.
ప్రతి ఏడాది లక్షల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇందులో రోడ్డు ఇంజినీరింగ్ లోనూ లోపాల కారణంగా కూడా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. యుద్ధాలతో కంటే రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువమంది మరణిస్తున్నారని మంత్రి అన్నారు. ప్రతి ఏడాది దాదాపు 5లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా..1.5లక్షల మంది చనిపోతున్నారన్నారు. ఈ ప్రమాదాల్లో మరో 3 లక్షల మంది గాయపడుతున్నారన్నారు. దీంతో జీడీపీకి 3 శాతం నష్టం వాటిల్లుతుందన్నారు.