ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: రెండేళ్ల క్రితం ఓటీటీలో విడుదలైన ‘ఓదెల రైల్వే స్టేషన్’ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అశోక్ తేజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ సంపత్ నంది కథ అందించారు. గ్రామీణ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో హెబ్బా పటేల్, వశిష్ట సింహ, పూజిత పొన్నాడలు తమ నటనతో ఆకట్టుకున్నారు. దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తర్వాత మేకర్స్ ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. ‘ఓదెల 2’గా సీక్వెల్ రాబోతుంది.
ఓదెల 2గా వస్తున్న సీక్వెల్‌కు కథ, కథనంతో పాటు నిర్మాతగా కూడా డైరెక్టర్ సంపత్ నంది వ్యవహరిస్తున్నారు. ఈ సీక్వెల్‌ని కూడా అశోక్ తేజనే తెరకెక్కిస్తున్నారు. ఓదెల రైల్వే స్టేషన్‌లో హెబ్బా పటేల్ నటించగా.. ఓదెల 2లో మాత్రం మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటిస్తున్నారు. నేడు మహాశివరాత్రి సందర్భంగా తమన్నా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
కాశీ గంగా నది తీరాన తమన్నా నడుస్తున్న ఫొటోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఓ చేతిలో ఢమరుఖం, మరో చేతిలో దండం పట్టుకుని తమన్నా ఉన్నారు. శివ శక్తిగా ఆమె నటిస్తున్నారు. ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. మొదటి పార్ట్ ఓటీటీలో రిలీజ్ కాగా.. ఈసారి థియేటర్లలో పలు భాషల్లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.