పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
ప్రతిపక్షం, హనుమకొండ ప్రతినిధి, మే 3: బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని ఓట్ల కోసం వచ్చే ఆ పార్టీల నాయకులను ప్రజలు గ్రామాల్లో నిలదీయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం పరకాల మండలం వెల్లంపల్లి, పోచారం, కామారెడ్డి పల్లి, అలియాబాద్ గ్రామాల కార్యకర్తలతో పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజ రైన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు గత పది సంవత్సరాల పాలనలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా, ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో మరోసారి మోసం చేసేందుకు వస్తున్న ఆ పార్టీ నేతలను ప్రజలు గ్రామాల్లో నిలదీయాలన్నారు.
కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకి ఇచ్చిన ఆరు గ్యారెంటీ ల అమలుపై చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడ్డ ప్రజా ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలను నెరవేర్చడం జరిగిందని తెలిపారు. మిగిలిన హామీలను కూడా నెరవేరుస్తుందని ధీమ వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకమై కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధి చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఐదు న్యాయ హామీలను సైతం ప్రజలకు వివరిస్తూ.. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. కొత్త పాత అనే తేడాలు లేకుండా కార్యకర్తలు అంతా సమిష్టిగా కృషిచేసి పార్లమెంటు అభ్యర్థి కడియం కావ్య గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దొమ్మాటి సాంబయ్య, మాజీ ఎమ్మెల్యే మోల్గూరి బిక్షపతి, రాష్ట్ర నాయకులు మండల పార్టీ అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి, మండల పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు ఆయా గ్రామ కమిటీ అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.