ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఈ ఎన్నికలు సంక్షేమం, అభివృద్ధి ప్రాతిపదికన జరగడంలేదు.. ఈ ఎన్నికలు రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్ల రద్దు ప్రాతిపదికన జరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల నేపథ్యంలో పఠాన్ చెరు కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ పాల్గొన్నారు. మతాల మధ్య, మనుషుల మధ్య చిచ్చు పెట్టి కత్తులతో పొడుచుకునేలా బీజేపీ కుట్రలు చేస్తోందని బీజేపీపై ఫైరయ్యారు. నీలం మధు, కాటా శ్రీను రామ లక్ష్మణుల్లా కలిసి పని చేయండి.. మీ రాజకీయ భవిష్యత్ కు మేం అండగా ఉంటాం అని తెలిపారు. పఠాన్ చెరు ప్రాంతం ఒక మినీ ఇండియా.. కులాలకు, మతాలకు అతీతంగా ఇక్కడి ప్రజలు కలిసి ఉంటారు.. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే నీలం మధు ఎంపీగా గెలవాలని పేర్కొన్నారు.
ఆనాడు వైఎస్ హయాంలో మెదక్ అభివృద్ధి జరిగింది.. మళ్లీ ఇప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత మాదన్నారు. మొన్నటి వరకు బీఆరెస్ బీజేపీ వాళ్లు ఎంపీలుగా ఉన్నారు.. వాళ్లు మెదక్ ప్రాంతానికి, ఇక్కడి ప్రజలకు ఏం చేశారో ఒక్కసారి ఆలోచన చేయండని గుర్తుచేశారు. మెదక్ జిల్లా రైతులను ముంచి పోలీసులతో కొట్టించిన దుర్మార్గుడు బీఆరెస్ అభ్యర్థి.. వేల కోట్లు సంపాదించుకున్న ఆయన.. కేసీఆర్, హరీష్ కు వందల కోట్లు ఇచ్చి టికెట్ తెచ్చుకుండు.. ఎమ్మెల్సీగా కొనసాగుతున్న బీఆరెస్ అభ్యర్థి ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు.. పెగ్గు మీద పెగ్గు వేసినట్టు కుర్చీ మీద కుర్చీ వేసుకుంటారా.. అని ఎద్దేవా చేశారు.
రాష్ట్రానికి వచ్చిన మోదీ, అమిత్ షా.. రాంచంద్రపురం వరకు మెట్రో విస్తరణకు నిధులు ఇస్తామని చెప్తారనుకున్నాం.. మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధి కి నిధులు ఇస్తారనుకున్నాం.. బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి ప్రస్తావిస్తారనుకున్నాం.. ఇవేవీ ఇవ్వకుండా.. హిందూ, ముస్లింల మధ్య కొట్లాట పెట్టాలని మోదీ ప్రయత్నిస్తున్నారు. ప్రజలు కత్తులతో పొడుచుకుని రక్తం చిందించాలని చూస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఇక్కడికి పెట్టుబడులు వస్తాయా..? అని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉండాలి.. ప్రజలు కలిసిమెలిసి ఉండాలి. ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ గెలవాలి. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తోంది.. ఇందిరమ్మ గెలిచిన మెదక్ నుంచి నీలం మధును బరిలోకి దించాం.. రిజర్వేషన్లు కాపాడలంటే కాంగ్రెస్ కు అండగా ఉండండి.. నీలం మధును లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించండి అని కోరారు.