Pawan Kalyan to Start 11 Days Deeksha over Laddu: తిరుమల లడ్డూలో ఉపయోగించే నెయ్యిలో జంతువులు కొవ్వు ఉపయోగించారనే ఆరోపణలు రావడంతో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ ఘటనపై సినిమా ప్రముఖలతోపాటు తెలుగు రాజకీయ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి స్పందించారు. శ్రీవారికి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనని తెలిపారు. ఇందులో భాగంగా ప్రాయశ్చిత్త దీక్ష చేయనున్నట్లు తెలిపారు. ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరూలోని దశావతార శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో దీక్ష చేపట్టి, 11 రోజులపాటు కొనసాగించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
‘పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదమని, గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైందన్నారు. జంతు అవశేషాలతో మాలిన్యమైందని, విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరన్నారు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకమని చెప్పారు. లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నా మనసు వికలమైందని, అపరాధ భావానికి గురైందన్నారు. ప్రజా క్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నాకు ఇటువంటి క్లేశం ఆదిలోనే నా దృష్టికి రాకపోవడం బాధించిందని, కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందేనని పిలుపునిచ్చారు. అందులో భాగంగా నేను ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించినట్లు తెలిపారు.