Pawan Kalyan visit to Vizianagaram district: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు విజయనగరంలో పర్యటించనున్నారు. ఈ మేరకు జిల్లాలోని గుర్ల గ్రామాన్ని ఆయన సందర్శించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల అతిసారంతో గుర్ల గ్రామంలో ఎనిమిది మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామానికి పవన్ కల్యాణ్ నేరుగా వెళ్లి అక్కడి పరిస్థితులపై సమీక్షించనున్నారు. కాగా, భూగర్భజలాలు కలుషితం కావడంతో వ్యాధి సోకినట్లు ప్రాథమికంగా నిర్ధారించామని అధికారులు పేర్కొంటున్నారు. వ్యాధి అదుపులోకి వచ్చే వరకు గుర్లలో ప్రత్యేక వైద్య శిబిరం కొనసాగుతోందని డీఎంహెచ్ఓ భాస్కరరావు తెలిపారు. అతిసారంతో మృతి చెందిన వారికి వ్యాధితోపాటు హార్ట్, కిడ్నీ, బీపీ, షుగర్ వంటి వ్యాధులు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. చంపావతిలోని ఊటబావి, గుర్లలో ప్రజలు వినియోగిస్తున్న ఐదు ప్రైవేట్ బోర్ల నీటిని పరీక్షించగా.. కలుషితమైనట్లు తేలిందని అధికారులు తెలిపారు.





























