79.33 శాతం ఓటింగ్ నమోదు..
ప్రతిపక్షం, నకిరేకల్, మే 13: నకిరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పార్లమెంటు ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఆసక్తి చూపారు. సోమవారం ఉదయం ఓటింగ్ సమయానికి ముందే ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. అయినప్పటికీ మొదటి రెండు గంటలు అంతగా పోలింగ్ శాతం నమోదు కాలేదు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 47.45 శాతం, మూడు గంటల వరకు 61.54 శాతం ఓటింగ్ నమోదయింది.
మొత్తం మీద 79.33 శాతం పోలింగ్ నమోదయింది. నియోజకవర్గంలోని 6 మండలాలైన రామన్నపేట, చిట్యాల, నార్కట్పల్లి, కట్టంగూరు, నకిరేకల్, కేతపల్లి లలో మొత్తం 305 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం నియోజకవర్గంలో 253785 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 125451 మంది పురుషులు, 128330 మంది మహిళలు, ఇతరులు నలుగురు ఉన్నారు. వరుస సెలవులు రావడంతో ఓటింగ్ లో పాల్గొనేందుకు ఒకటి, రెండు రోజుల ముందే ఓటర్లు వారి స్వస్థలాలకు చేరుకున్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పట్టణంలోని నలంద కాలేజీలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. అనంతరం నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలకు విచ్చేసి ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఆయా కేంద్రాల వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులను, ప్రజా ప్రతినిధులను, కార్యకర్తలను కలిసి ఓటింగ్ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు చిట్యాల లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సతీమణితో కలిసి ఓటు వేశారు. చిట్యాల పురపాలిక కేంద్రంలో ఓటర్ స్లిప్పులను పంపిణీ చేయకపోవడంతో ఓటర్లు ఇబ్బంది పడ్డారు.