ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీకి చోటు లేదు
ఈ గెలుపు జీహెచ్ఎంసీ గెలుపునకు నాంది
టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్
(ప్రతిపక్షం స్టేట్ బ్యూరో)
హైదరాబాద్, నవంబర్ 14: జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టారని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ఈ గెలుపును అంకితం చేస్తున్నామని చెప్పారు. జూబ్లీహిల్స్ తీర్పుతో ప్రజలు బీఆర్‌ఎస్ పార్టీకి సెలవు చెప్పారని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికలలోను గుండు సున్నాతో బీఆర్ఎస్‌కు భవిష్యత్తు లేదని ప్రజలు స్పష్టం చేశారని గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ తీర్పుతో రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు చోటు లేదని మరోసారి రుజువు చేశారన్నారు. రానున్న రోజులలోను ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలన కొనసాగుతుందన్నారు. బీసీ బిడ్డ నవీన్ యాదవ్‌ను గెలిపించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తదని వివరించారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు సాధించడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ కనీసం పదేళ్లు అధికారంలో కొనసాగడం తథ్యమని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పనితీరుపట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసి, భారీ మెజార్టీతో విజయం కట్టబెట్టారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, చైర్మన్లు, పార్టీ బేరర్స్ శ్రమ ఫలితమే ఈ గెలుపు అని పీసీసీ చీఫ్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ విజయం జీహెచ్ఎంసీ ఎన్నికలకు నాంది అన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.


























