Janasena Leaders Attack On YSRCP Leader Perni: వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై బుధవారం పేర్ని నాని చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ మచిలీపట్నంలోని ఆయన నివాసం వద్ద జనసేన నేతలు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు పవన్ కల్యాణ్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు పేర్ని నాని ఇంటికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇరువర్గాల ఆందోళనతో పోలీసులు భారీగా మోహరించారు. అయితే ఆ ప్రాంతమంతా జనసేన, వైసీపీ నినాదాలతో ఉద్రిక్తంగా మారింది. ఇదిలా ఉండగా, ఆందోళన చేస్తున్న జనసేన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం పేర్ని నాని ఇంటి వద్ద గుమిగూడిన వైసీపీ కార్యకర్తలను వెనక్కి పంపించారు.